Sri Vaishnava Acharyas: శ్రీవైష్ణవ ఆచార్యులు చూపిన భక్తి, శరణాగతి, ఆచార్య నిష్ఠ, కైంకర్య మార్గాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని తిరువల్లిక్కేణికి చెందిన ప్రముఖ పండితులు శ్రీ మాడభూషి అనంతాళ్వాన్ తెలిపారు.

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహించిన “శ్రీవైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలు” జాతీయ సదస్సు బుధవారం ఘనంగా ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పండితులు, ఆచార్యులు ఈ సదస్సులో పాల్గొని శ్రీవైష్ణవ సంప్రదాయం, ఆచార్య భక్తి, శరణాగతి, కైంకర్యం తదితర అంశాలపై ప్రసంగించారు.

ఎంబార్ వాళి తిరునామం విశిష్టమైనది – శ్రీ మాడభూషి అనంతాళ్వాన్

శ్రీ మాడభూషి అనంతాళ్వాన్ “ఎంబార్ వళి తిరునామం” అంశంపై మాట్లాడుతూ, భగవంతునిపై అచంచలమైన భక్తితోపాటు ఆచార్యుల పట్ల సంపూర్ణ విశ్వాసం, శరణాగతి కలిగి ఉండటమే శ్రీవైష్ణవ సంప్రదాయంలోని ప్రధాన సందేశమన్నారు. శ్రీరామానుజాచార్యులు, ఎంబార్ వంటి ఆచార్యులు చూపిన భక్తి, శరణాగతి మార్గం అందరికీ ఆదర్శమన్నారు.

ఎంబార్ తనియన్‌లో ఆచార్య భక్తి – డా. ధనంజయన్

చెన్నైకి చెందిన డా. ధనంజయన్ “ఎంబార్ తనియన్‌లోని భక్తి – పెరియ తిరుమొళి వైశిష్ట్యం” అంశంపై మాట్లాడుతూ, ఎంబార్ తనియన్‌లో ఆచార్య భక్తి, శరణాగతి భావాలు ఎంతో విశిష్టంగా ప్రతిఫలిస్తాయని తెలిపారు. ఆళ్వార్ల పాశురాల్లోని భక్తి తత్వాన్ని ఆచార్యులు తరతరాలకు అందించారని వివరించారు.

శ్రీరామానుజుల ప్రియ శిష్యుడు ఎంబార్ – శ్రీ సముద్రాల శఠగోపాచార్య

వరంగల్‌కు చెందిన శ్రీ సముద్రాల శఠగోపాచార్య “ఎంబార్ – శ్రీరామానుజులు” అంశంపై మాట్లాడుతూ, శ్రీరామానుజాచార్యుల ప్రియ శిష్యుడిగా ఎంబార్ విశిష్ట స్థానాన్ని పొందారని తెలిపారు. ఆచార్య భక్తి, వినయం, శరణాగతి, కైంకర్య భావాలకు ఎంబార్ జీవితం గొప్ప నిదర్శనమన్నారు.

ఆండాళ్ తనియన్లలో భక్తి వైభవం – శ్రీ విష్ణుచిత్తన్ స్వామి

శ్రీరంగానికి చెందిన శ్రీ విష్ణుచిత్తన్ స్వామి “ఆండాళ్‌పై పుండరీకాక్ష స్వామి రచించిన తనియన్ల విశిష్టత” అంశంపై మాట్లాడుతూ, ఆండాళ్ అమ్మవారి తనియన్లలో ఆమె అపారమైన భక్తి, శ్రీమన్నారాయణునిపై అచంచలమైన ప్రేమ, శరణాగతి భావాలు హృద్యంగా ప్రతిఫలిస్తాయని తెలిపారు. ఆండాళ్ అమ్మవారి బోధనలు నేటి తరానికి కూడా మార్గదర్శకమన్నారు.

భగవద్విషయ వ్యాఖ్యానాల్లో దాశరథి అనుభవం – శ్రీ దేవరాజన్

బెంగళూరుకు చెందిన శ్రీ దేవరాజన్ “భగవద్విషయ వ్యాఖ్యానాల్లో దాశరథి అనుభవం” అంశంపై మాట్లాడుతూ, ఆళ్వార్ల దివ్యప్రబంధంలోని భక్తి, శరణాగతి, భగవత్ అనుభవాలను ఆచార్య పరంపర ద్వారా భక్తులకు అందించడంలో దాశరథి చేసిన సేవలు విశిష్టమైనవని తెలిపారు. దాశరథి అనుభవం భక్తి, ఆచార్య నిష్ఠ, భగవత్ కైంకర్యంతో కూడిన ఆధ్యాత్మిక అనుభవమన్నారు.

పరాశర భట్టర్ ఆచార్య భక్తి ఆదర్శప్రాయం – శ్రీ బద్రి భట్టర్ స్వామి

శ్రీరంగానికి చెందిన శ్రీ బద్రి భట్టర్ స్వామి “పరాశర భట్టర్ ఆచార్య భక్తి” అంశంపై మాట్లాడుతూ, ఆచార్యుల పట్ల విశ్వాసం, వినయం, భక్తి, శరణాగతి భావాలను పరాశర భట్టర్ తన జీవితంలో ఆచరించి చూపారని తెలిపారు. ఆయన ఆచార్య నిష్ఠ, భగవత్ భక్తి, కైంకర్య భావం ప్రతి భక్తునికీ ఆదర్శమన్నారు.

శ్రీరామానుజుల వళి తిరునామం వైభవం – డా. రవికుమార్ స్వామి

హైదరాబాద్‌కు చెందిన డా. రవికుమార్ స్వామి “శ్రీరామానుజుల వళి తిరునామం పెరుమై” అంశంపై మాట్లాడుతూ, శ్రీరామానుజాచార్యుల దివ్య జీవితం, ఆచార్య భక్తి, భగవత్ కైంకర్యం, శరణాగతి తత్వాలను వళి తిరునామం స్మరింపజేస్తుందని తెలిపారు. శ్రీరామానుజుల నామస్మరణ భక్తికి బలం, శరణాగతికి మార్గం, కైంకర్యానికి స్ఫూర్తిని అందిస్తుందని పేర్కొన్నారు.

శ్రీరంగనాథుని వైభవాన్ని చాటిన ‘అరంగనుమ్ ఆండనుమ్’ – శ్రీ శ్రీనివాసాచార్య స్వామి

శ్రీరంగానికి చెందిన శ్రీ శ్రీనివాసాచార్య స్వామి “అరంగనుమ్ ఆండనుమ్” అంశంపై మాట్లాడుతూ, శ్రీరంగనాథస్వామివారికి, ఆచార్య పరంపరకు ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని వివరించారు. ఆళ్వార్లు, ఆచార్యులు అందించిన భక్తి, శరణాగతి, కైంకర్య మార్గాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story