The Birth of Sage Vedavyasa: మహాభారతంలో అత్యంత కీలకమైన వేదవ్యాసుడి జననం వెనుక ఒక అద్భుతమైన, దైవికమైన రహస్యం దాగి ఉంది. లోకకళ్యాణం కోసం, హిందూ ధర్మాన్ని భావితరాలకు అందించడం కోసం జరిగిన ఈ సంఘటన భగవంతుడి సంకల్పంగా పెద్దలు చెబుతుంటారు. చేసల వాసన వచ్చే ఒక సాధారణ జాలరి కన్య, లోక పూజితుడైన ఒక మహర్షి కలయిక వల్ల విశ్వానికి గొప్ప జ్ఞానాన్ని అందించిన వ్యాస భగవానుడు జన్మించారు.

సత్యవతి అనే ఒక జాలరిరాజు పెంపుడు కూతురు యమునా నదిపై పడవ నడుపుతూ ఉండేది. ఆమె ఒంటి నుంచి ఎప్పుడూ చేపల వాసన రావడం వల్ల ఆమెను అందరూ మత్స్యగంధి అని పిలిచేవారు. ఒకరోజు ప్రముఖ పరాశర మహర్షి యమునా నదిని దాటడానికి సత్యవతి నడుపుతున్న పడవ ఎక్కారు. ఆ సమయంలో త్రికాలజ్ఞాని అయిన పరాశర మహర్షి, సత్యవతిలో ఉన్న దైవత్వాన్ని గ్రహించారు. లోకానికి వేదాలను విభజించి, పురాణాలను అందించే ఒక గొప్ప జ్ఞాని అవసరమని గుర్తించిన మహర్షి, ఆమె ద్వారా ఒక పుత్రుడిని పొందాలని ఆశించారు.

మహర్షి కోరిక విన్న సత్యవతి మొదట భయపడి, సమాజానికి భయపడి కొన్ని సందేహాలను లేవనెత్తింది. తాను కన్యగా ఉన్నానని, పగటిపూట అందరూ చూస్తుండగా ఇది ఎలా సాధ్యమని, అలాగే తన ఒంటి నుంచి వచ్చే దుర్వాసన మహర్షికి ఇబ్బంది కలిగిస్తుందని చెప్పింది. అప్పుడు పరాశర మహర్షి తన తపఃశక్తితో అక్కడ దట్టమైన పొగమంచును సృష్టించి ఎవరికీ ఏమీ కనిపించకుండా చేశారు. అంతేకాకుండా, ఆమె ఒంటి నుంచి వచ్చే చేపల వాసనను పూర్తిగా పోగొట్టి, యోజన దూరం వరకు పరిమళించేలా అద్భుతమైన సుగంధాన్ని వరంగా ఇచ్చారు. దీనివల్లే ఆమెకు యోజనగంధి అనే పేరు వచ్చింది. అలాగే ఈ జననం వల్ల ఆమె కన్యాత్వానికి ఎలాంటి భంగం కలగదని, జన్మించబోయే కుమారుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడై నలుగురికీ జ్ఞానాన్ని పంచుతాడని మాట ఇచ్చారు.

ఆ మహర్షి తపఃశక్తి వల్ల యమునా నది మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో సత్యవతి ఒక బాలుడికి జన్మనిచ్చింది. నల్లటి రంగులో ఉండటం వల్ల, అలాగే ద్వీపంలో జన్మించడం వల్ల ఆ బాలుడికి కృష్ణ ద్వైపాయనుడు అనే పేరు వచ్చింది. పుట్టగానే ఆ బాలుడు సాధారణ పిల్లలలా కాకుండా క్షణాల్లోనే పెద్దవాడై, అద్భుతమైన తేజస్సుతో ప్రకాశించాడు. తన తల్లికి నమస్కరించి, భవిష్యత్తులో ఆమెకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కేవలం తనను మనసులో స్మరిస్తే చాలు, క్షణాల్లో ప్రత్యక్షమవుతానని చెప్పి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. ఆ బాలుడే తర్వాత కాలంలో నాలుగు వేదాలను విభజించి, అష్టాదశ పురాణాలను, మహాభారతాన్ని రచించి లోక ప్రసిద్ధుడైన వేదవ్యాసుడిగా మారారు. ఒక కన్య గర్భాన జన్మించినా, మహర్షి తపఃశక్తి వల్ల ఆమె కన్యాత్వం చెడకపోవడం, పుట్టిన వెంటనే బాలుడు పెద్దవాడై జ్ఞానిగా మారడం ఈ జననం వెనుక ఉన్న అసలైన దైవ రహస్యం.

PolitEnt Media

PolitEnt Media

Next Story