TTD Confirms: సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలు వాస్తవం : టీటీడీ
టీటీడీ

TTD Confirms: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల అవసరాలు, విక్రయాలకు సరిపడా 1.30 లక్షల అగరబత్తుల ప్యాకెట్లు టీటీడీ వద్ద అందుబాటులో ఉన్నాయని టీటీడీ వెల్లడించింది.
తిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణశాలలో నిర్వహిస్తున్న అగరబత్తుల తయారీ కేంద్రాన్ని మూసివేసినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.
గతంలో అగరబత్తుల తయారీ బాధ్యతలు నిర్వహించిన బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థకు ఐదున్నర సంవత్సరాల కాంట్రాక్టు గడువు పూర్తయింది. అయితే, ఆ సంస్థ ఉత్పత్తుల సరఫరా కోసం అక్టోబరు 31వ తేదీ వరకు మరో నెలపాటు గడువును పొడిగించారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 1వ తేదీ నుంచి దర్శన్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అగరబత్తుల తయారీ కొనసాగుతోంది.
గతంలో పనిచేసిన కార్మికులతోనే తయారీ కేంద్రం కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని, ప్రతిరోజూ అగరబత్తుల తయారీ జరుగుతోందని టీటీడీ తెలిపింది. భక్తుల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాలపై అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఏదైనా సమాచారం ప్రసారం చేసే ముందు వాస్తవాలను సంబంధిత అధికారుల ద్వారా నిర్ధారించుకోవాలని సూచించింది.

