The Spiritual Significance of Temple Steps: సనాతన ధర్మంలో ప్రతి ఆచారానికి ఒక లోతైన అర్థం ఉంటుంది. సాధారణంగా మనం ఏదైనా పురాతన ఆలయానికి వెళ్లినప్పుడు, గుడి మెట్లను చేతులతో తాకి నమస్కరించుకుని లోపలికి వెళ్లడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. చాలామంది దీనిని ఒక సాధారణ అలవాటుగా భావిస్తారు, కానీ జ్యోతిష్య, ఆధ్యాత్మిక నిపుణుల ప్రకారం.. గుడి మెట్లకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆలయ విజ్ఞాన శాస్త్రంలో ఈ మెట్ల వెనుక దాగి ఉన్న రహస్యాలు ఇవే..

అహంకారాన్ని విడిచిపెట్టడం

గుడి మెట్లపై అడుగుపెట్టే ముందు వాటిని చేతులతో తాకి కళ్లకు అద్దుకోవడం అనేది భగవంతుడి ముందు మన అహంకారాన్ని, గర్వాన్ని వదిలేయడానికి సంకేతం. "నేను నా అంతస్తు, పదవి, గర్వాన్ని గుడి బయటే వదిలేసి.. నీ సేవకుడిగా లోపలికి వస్తున్నాను" అనే నమ్రతను ఈ చిన్న అలవాటు మనలో కలిగిస్తుంది.

ప్రతికూల శక్తిని తొలగించడం

పురాతన ఆలయాల నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లకు విశ్వంలోని సానుకూల శక్తిని గ్రహించే గుణం ఉంటుంది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు మంత్రోచ్ఛారణలు చేస్తూ, దైవచింతనతో ఆ మెట్లపై నడుస్తుంటారు. మనం ఆ మెట్లను తాకినప్పుడు మన శరీరంలోని ప్రతికూల ఆలోచనలు, అలసట తొలగిపోయి, మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

ఇంద్రియాల నియంత్రణ

ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం.. గుడిలోని మెట్లు మన శరీరంలోని ఐదు ఇంద్రియాలకు ప్రతీకలు. ఈ ఇంద్రియాల ద్వారా కలిగే కోరికలను నియంత్రించుకుంటూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ గర్భగుడి వైపు సాగడం అంటే.. ప్రాపంచిక బంధాలను దాటుకుని పరమాత్మ వైపు ప్రయాణించడమే అనే లోతైన తత్వశాస్త్రం ఇందులో ఉంది.

భూమాతకు, శిల్పులకు కృతజ్ఞత

ఆలయానికి ఆధారం భూమి. అంతటి భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కరించడం ఒక ఎత్తయితే.. రాత్రింబగళ్లు శ్రమించి, తమ చేతులతో ఆ రాళ్లను అద్భుతమైన శిల్పాలుగా, మెట్లుగా మార్చిన శిల్పుల నైపుణ్యానికి, వారి త్యాగానికి కృతజ్ఞత తెలపడం కూడా ఈ ఆచారంలో భాగమే.

ఆలయానికి వెళ్లినప్పుడు పాటించాల్సిన ముఖ్య నియమాలు..

మెట్లపై కూర్చోవద్దు:

గుడి మెట్లపై ఎప్పుడూ కాళ్లు చాపి కూర్చోవడం లేదా అనవసరమైన లౌకిక విషయాల గురించి మాట్లాడటం చేయకూడదు.

దైవ స్మరణ:

మెట్లు ఎక్కుతున్నంత సేపూ ఇతరుల గురించి కాకుండా, మీరు దర్శించుకోబోయే దైవ నామాన్ని (ఉదాహరణకు: ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ) మనస్సులో స్మరించుకోవడం ఉత్తమం.

హిందూ సంస్కృతిలో భాగమైన గుడి మెట్లు కేవలం పైకి వెళ్లడానికి నిర్మించినవి కావు, అవి మనిషిని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అంతఃచేతన మార్గాలు. కాబట్టి తదుపరిసారి మీరు ఆలయానికి వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకుని, భక్తితో ఆ మెట్లకు నమస్కరించి అడుగు ముందుకు వేయండి..

PolitEnt Media

PolitEnt Media

Next Story