Puri Jagannath Temple: : శ్రీకృష్ణుడే సాక్షాత్తు జగన్నాథుడిగా కొలువైన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం.. ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం. చార్ ధామ్ యాత్రలో అత్యంత ముఖ్యమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం వెనుక.. భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఎన్నో నమ్మశక్యం కాని రహస్యాలు దాగి ఉన్నాయి. ఇప్పటివరకు ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినా.. ఇప్పటికీ ఛేదించలేని ఆ ఆలయ వింతలు, విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గాలికి ఎదురుగా ఎగిరే జెండా!

సాధారణంగా గాలి ఏ దిశగా వీస్తే.. జెండా ఆ దిశగానే ఎగురుతుంది. కానీ, పూరి ఆలయ శిఖరంపై ఉండే జెండా మాత్రం ఎప్పుడూ గాలి వీచే దిశకు పూర్తి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. దీని వెనుక సైన్స్ ఏంటో ఎవరికీ తెలియదు. అంతేకాదు, ప్రతిరోజూ సాయంత్రం ఆలయ పూజారి ఏకంగా 45 ఓ అంతస్తుల ఎత్తు ఉండే గోపురాన్ని ఎక్కి.. ఏమాత్రం సపోర్ట్ లేకుండా ఈ జెండాను మారుస్తారు. ఈ ఆచారం గత 1800 సంవత్సరాలుగా నిరంతరాయంగా సాగుతోంది. ఒక్క రోజు జెండా మార్చకపోయినా.. ఆలయం రాబోయే 18 ఏళ్ల పాటు మూతపడుతుందని నమ్ముతారు.

ప్రకృతి నియమాలకు విరుద్ధం!

సాధారణంగా సముద్ర తీర ప్రాంతాలలో పగటిపూట గాలి సముద్రం నుండి భూమి వైపునకు, రాత్రి పూట భూమి నుండి సముద్రం వైపునకు వీస్తుంది. కానీ పూరిలో మాత్రం దీనికి పూర్తి రివర్స్ జరుగుతుంది.

అలాగే ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ఉండే "సింహద్వారం" దగ్గర మరో వింత కనిపిస్తుంది. ఆలయం వెలుపల ఉన్నప్పుడు సముద్రపు అలల శబ్దం స్పష్టంగా వినబడుతుంది. కానీ, మీరు సింహద్వారంలో అడుగుపెట్టి ఆలయంలోకి వెళ్లిన మరుక్షణమే.. సముద్రపు శబ్దం అస్సలు వినిపించదు. మళ్లీ ఆలయం నుండి బయటకు రాగానే ఆ శబ్దం వినిపిస్తుంది.

పక్షులు ఎగరని గోపురం!

సాధారణంగా ఏ ఆలయ గోపురం మీదైనా పక్షులు వాలడం, ఎగరడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, పూరి జగన్నాథ ఆలయ గోపురం పైభాగంలో ఏ పక్షి కూడా ఎగరదు, వాలదు. చివరికి విమానాలు సైతం ఈ ఆలయం పైనుంచి ప్రయాణించవు. దీన్ని నో-ఫ్లై జోన్ (No-Fly Zone) గా కూడా పరిగణిస్తారు. అంతేకాదు, పట్టపగలు ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ఈ సువిశాల ఆలయ ప్రధాన గోపురం నీడ భూమిపై ఎక్కడా పడదు!

ఏడు కుండల మహా ప్రసాదం

జగన్నాథుడి వంటశాల ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలగా పేరుగాంచింది. ఇక్కడ ప్రతిరోజూ లక్షల మంది భక్తుల కోసం ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని వండటానికి కట్టెల పొయ్యిపై ఒకదానిపై ఒకటి చొప్పున ఏడు మట్టి కుండలను పెడతారు. ఇక్కడే అసలు వింత దాగి ఉంది. అన్నింటికంటే కింద ఉన్న కుండలో అన్నం మొదట ఉడకాలి కదా.. కానీ ఇక్కడ అన్నింటికంటే పైన (ఏడో స్థానంలో) ఉన్న కుండలోని అన్నం మొదట ఉడుకుతుంది. ఆ తర్వాత కింద ఉన్న కుండలలోని అన్నం ఒకదాని తర్వాత ఒకటి ఉడుకుతుంది.అలాగే ఇక్కడ వండే ప్రసాదం ఎంతమంది భక్తులు వచ్చినా అస్సలు తక్కువ కాదు.. అలాగని ఒక్క ముద్ద కూడా వృథా కాదు.

మట్టితో చేసిన బలరామ, సుభద్ర, జగన్నాథుల విగ్రహాలు.. ప్రతి 12 లేదా 19 ఏళ్లకు ఒకసారి మార్చే నవకళేబర ఉత్సవం.. ఇలా పూరి క్షేత్రంలో అడుగడుగునా అద్భుతాలే కొలువై ఉన్నాయి.

Next Story