Annavaram Prasadam: అన్నవరం ప్రసాదం అద్భుతహా!
ప్రసాదం అద్భుతహా!
Annavaram Prasadam: సత్యనారాయణ స్వామి అంటే టక్కున గుర్తొచ్చే దేవస్థానం అన్నవరం. కాకినాడ జిల్లాలో ఈ ప్రముఖ దేవాలయం ఉంది. ఇక్కడ స్వామివారు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి కొలువై ఉండి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం అన్నవరం లోని రత్నగిరి కొండపై 1891లో నిర్మించారు. ఈ ప్రాంతం ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. హిందువులు పవిత్రంగా భావించే కార్తీకమాసంలో ఇచ్చట కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం చాలా ప్రాశ్యస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది. సమీపంలో పంపానది హోయలొలుకుతూ పారుతుంటుంది.
కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయములో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించేందుకు గుడివరకు ఘాట్ రోడ్డు నిర్మించారు. మెట్లు గుండా కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండువగా చేసుకొంటూ ఉండటం ఒక ప్రత్యేకత. ఇది చూచి తీరవలసిన సుందర దృశ్యం. ఇతిహాసాల ప్రకారం అడిగిన (అనిన) (వరం) వరాలను తీర్చే దేవుడు కాబట్టి ( అనిన+ వరం = అన్నవరం) "అన్నవరం దేవుడు" అని అంటారు.భారతదేశంలో ఇది ముఖ్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున రామాలయం, విశ్రాంతి మందిరం, ఎడమవైపున కళ్యాణ మండపం ఉన్నాయి. రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజనశాల ఉన్నాయి. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కనుక, గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి. అలాగే గుడి వెనుక గుట్టమీద అనేక కాటేజ్ లు ఉన్నాయి. సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రవేశించగానే ప్రశాంతత చేకూరుతుంది అనేది భక్తుల అనుభవం. ఆలయ ముఖద్వారం, స్వామివారి విగ్రహం, గాలి గోపురం దేనికదే మహా సుందరంగా ఉంటుంది. సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు, వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఒక్కో క్షేత్రానికీ ఒక్కో విశేషం ఉన్నట్టే భక్తులకు పంచే ప్రసాదాల్లోనూ ప్రత్యేకత ఉంటుంది. అన్నవరం ప్రసాదం నిజంగా అద్భుతమైనది. ఇది అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రసాదంగా వడ్డించే గోధుమ నూకతో చేసిన ఒక తీపి వంటకం. ఇది చాలా రుచికరమైనది మరియు భక్తులలో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రసాదం రుచి చాలా ప్రత్యేకమైనది మరియు మరెక్కడా దొరకదు. గోధుమ నూక, పంచదార, నెయ్యి, యాలకుల పొడిలతో తయారు చేస్తారు. ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేస్తారు, దీనివల్ల రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తులు ఈ ప్రసాదాన్ని అమృతంతో పోలుస్తారు, ఇది దైవప్రసాదంగా భావిస్తారు.
