Throwing Away Flowers Used in Ganapati Puja: గణపతి పూజ పువ్వులను పారేస్తున్నారా? ఈ 4 పద్ధతుల్లో మళ్లీ ఉపయోగించండి..
మళ్లీ ఉపయోగించండి..

Throwing Away Flowers Used in Ganapati Puja: వినాయక నవరాత్రుల్లో లంబోదరుడి పూజ, మండపాల అలంకరణ కోసం రోజూ రకరకాల పూలు, పూలమాలలను విరివిగా ఉపయోగిస్తారు. అయితే పూజ ముగిసిన తర్వాత చాలామంది ఆ పువ్వులను చెత్తబుట్టలో వేయడమో లేదా సమీపంలోని నదులు, చెరువుల్లో పడేయడమో చేస్తుంటారు. ఇది పర్యావరణానికి, జలవనరులకు హానికరం. పవిత్రమైన పూజా పుష్పాలను వృథా చేయకుండా, పర్యావరణహితంగా ఇంట్లోనే 4 ఉపయోగకరమైన పద్ధతుల్లో ఎలా రీసైకిల్ చేసుకోవచ్చో తెలుసుకోండి.
కొత్త పూల మొక్కలను పెంచండి
పూజలో ఉపయోగించిన బంతి పూలతో కొత్త మొక్కలను సులభంగా పెంచుకోవచ్చు.. వాడిపోయిన బంతి పూలను ఎండబెట్టాలి. రేకల కింది భాగంలో ఉండే నల్లటి విత్తనాలను వేరుచేసి కుండీలో లేదా తోటలో చల్లాలి. ఎండిన పూల రేకలను మట్టిలో కలిపితే అది నేలకు సహజ పోషకంగా మారి, కొన్ని రోజుల్లోనే ఆరోగ్యకరమైన కొత్త మొక్కలు మొలకెత్తుతాయి.
మొక్కలకు సేంద్రియ ఎరువు
మిగిలిపోయిన పూలు, ఆకులు మొక్కలకు బలమైన పోషక ఎరువుగా పనిచేస్తాయి. ఇంటి పెరట్లో ఒక చిన్న గుంత తీసి అందులో వాడిన పూలను వేసి మట్టితో కప్పేయాలి. నెల రోజుల్లో ఇవి పూర్తిగా కుళ్ళిపోయి మేలైన కంపోస్ట్‌గా మారతాయి. లేదా ఒక కుండలో పూలు, ఆకులు, కూరగాయల తొక్కలను మట్టితో పొరలుగా చేర్చి కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు.
ఇంట్లోనే సహజ సువాసనల ధూపం
కెమికల్స్ లేని సహజసిద్ధమైన అగరుబత్తులు లేదా ధూప్ స్టిక్స్ తయారు చేయడానికి ఈ పువ్వులు ఉత్తమ ఎంపిక. పూల రేకలను నీడలో బాగా ఎండబెట్టి మెత్తటి పొడిగా రుబ్బుకోవాలి. ఈ పొడికి కొద్దిగా కర్పూరం, గంధం పొడి, ఆవు పిడకల పొడిని కలపాలి. కొద్దిగా నెయ్యి జోడించి ముద్దలా చేసి స్థూపాకారపు ధూప్ లేదా కడ్డీలుగా ఒత్తుకుని ఎండబెడితే స్వచ్ఛమైన సువాసననిచ్చే ధూపం సిద్ధమవుతుంది.
సహజ ఎయిర్ ఫ్రెషనర్
గదిలో ఆహ్లాదకరమైన సువాసన నింపేందుకు పోట్‌పౌరీని సులభంగా తయారు చేయవచ్చు. పూల రేకలను ఎండబెట్టి గాజు లేదా పింగాణీ గిన్నెలో వేయాలి. వీటికి కొన్ని సుగంధ మూలికలు (దాల్చినచెక్క, లవంగాలు లేదా సుగంధ తైలాలు) కలిపి లివింగ్ రూమ్‌లో ఉంచితే ఇల్లంతా తాజా సువాసనతో నిండిపోతుంది. అయితే బూజు పట్టకుండా ఉండటానికి వీటిని తేమ తగలకుండా పొడిగా ఉంచడం ముఖ్యం

