Robust Arrangements for Panchami Thirtham: పంచమీ తీర్థానికి పటిష్ట ఏర్పాట్లు
తీర్థానికి పటిష్ట ఏర్పాట్లు

Robust Arrangements for Panchami Thirtham: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన నవంబరు 25వ తేదీ మంగళవారం జరుగనున్న పంచమీ తీర్థానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టిటిడి పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది.
ఇంజినీరింగ్
పంచమీ తీర్థం నిర్వహణకు అవసరమైన క్యూలైన్లు, బ్యారీకేడ్లు, పద్మపుష్కరిణిలోనికి ప్రవేశ, నిష్క్రమణ గేట్లు, సూచిక బోర్డులు తదితర ఇంజినీరింగ్ పనులు పూర్తయ్యాయి.
భద్రత
తిరుచానూరుకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టిటిడి భద్రత, నిఘా విభాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా టిటిడి భద్రతా సిబ్బంది 600 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ 200, ఎన్.సి.సి.విద్యార్థులు 200, శ్రీవారి సేవకులు 900, పోలీస్ సిబ్బంది 1600 మందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
అన్నప్రసాదం కౌంటర్లు
భక్తుల సౌకర్యార్థం దాదాపు 150 అన్నప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. తోళ్ళప్ప గార్డన్స్‌లో 50, ఎస్వీ హైస్కూల్ వద్ద -15, శ్రీ అయప్పస్వామివారి (నవజీవన్ ఆసుపత్రి)ఆలయం వద్ద – 45, పూడి ఏరియాలో – 25., గేట్ – 4లో ఎమర్జెన్సీ – 15 అన్నప్రసాదం కౌంటర్లలో పంపిణీ చేస్తారు. అదేవిధంగా క్యూలైన్లలోని భక్తులకు అవసరమైన త్రాగునీరు, అల్పాహరం, అన్నప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేస్తారు.
మరుగుదొడ్లు
ఇందులో భాగంగా 284 శాశ్వత, తాత్కాలికం, మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇందుకు అవసరమైన అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు.
సూచిక బోర్డులు –
అమ్మవారి దర్శన సమయం, అన్నప్రసాదాలు, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర ప్రాంతాలను భక్తులు సులభంగా గుర్తించేందుకు వీలుగా వివిధ ప్రాంతాలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.
వైద్యం –
వైద్య, పారా మెడికల్ సిబ్బంది, 3 ప్రాంతాలలో ప్రథమచికిత్స కేంద్రాలు, 5 అంబులెన్స్‌లు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. స్విమ్స్, రుయా ఆసుపత్రులకు చెందిన వైద్యులు, ఆయుర్వేద వైద్యులు భక్తులకు సేవలందిస్తారు. అదేవిధంగా ఫైర్, జాతీయ విపత్తు నివారణ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
పార్కింగ్
పంచమి తీర్థానికి విచ్చేసే భక్తులకు శిల్పారామం, తనపల్లి క్రాస్, మార్కెట్‌యార్డు, రామానాయుడు కల్యాణ మండపం, పూడి జంక్షన్, తిరుచానూరు దళిత వాడ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. ప్రముఖులకు తిరుచానూరు పంచాయతీ కార్యాలయం ఎదురుగా పార్కింగ్ ఏర్పాటు చేశారు.
63 ఎల్ ఈ డీ స్క్రీన్ లు ఏర్పాటు
శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వీలుగా తిరుచానూరు, తిరుపతి పరిసర ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి ఆలయాల్లో ఇప్పటికే 25 ఎల్ ఈ డీ స్క్రీన్ లు ఏర్పాటు చేయగా, పంచమీ తీర్థం రోజున హోల్డింగ్ పాయింట్లు వద్ద అదనంగా 34 స్క్రీన్ లు, పద్మసరోవరం వద్ద – 4 స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.
హోల్డింగ్ పాయింట్లు నుండి మాత్రమే పద్మసరోవరంకి :
భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన హోల్డింగ్ పాయింట్లు నుండి తిరుచానూరు పద్మాసరోవరానికి చేరుకోవాల్సి ఉంటుంది. భక్తుల కోసం 1.జడ్పీ హైస్కూల్ 2. పూడి ఏరియా 3. నవజీవన్ ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన హోల్డింగ్ పాయింట్లు నుండి మాత్రమే భక్తులు పద్మసరోవరంకి చేరుకోవాల్సి ఉంటుంది.
శ్రీవారి సేవకులు
పంచమి తీర్థంలో భక్తులకు సేవలందించేందుకు దాదాపు 900 మంది శ్రీవారి సేవకులు టిటిడిలోని వివిధ విభాగాలలో సేవలందిస్తారు.
ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం
శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచమీ తీర్థం కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు.

