Tirumala Kshetram: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని "పుష్ప ప్రియుడు" అని కొలుస్తారు. అందుకే తిరుమల క్షేత్రానికి "పుష్ప మండపం" అనే పేరు కూడా ఉంది. స్వామివారికి నిత్యం జరిగే కైంకర్యాల నుండి బ్రహ్మోత్సవాల వరకు అడుగడుగునా పూల అలంకరణే ప్రధానం. ఇంతటి భారీ స్థాయిలో పూలను సమకూర్చడం వెనుక టీటీడీ ఉద్యానవన శాఖ ఎంతో కృషి చేస్తోంది. 1991 నుంచి ఈ విభాగం తిరుమల, తిరుపతిలోని ఉద్యానవనాల నిర్వహణతో పాటు శ్రీవారి ఆలయానికి అవసరమైన పూల సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది.

ప్రస్తుతం తిరుమల, తిరుపతి వ్యాప్తంగా సుమారు 61 ఎకరాల్లో ఈ పూల తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో 54 ఎకరాల్లో అలంకార తోటలు ఉండగా, మిగిలిన 7 ఎకరాల్లో ప్రత్యేకంగా పూల సాగు జరుగుతోంది. శ్రీవారి ఆలయంలో ఏడాదికి సుమారు 450కి పైగా ఉత్సవాలు, కైంకర్యాలు జరుగుతుంటాయి. వీటి కోసం ఏటా దాదాపు 2.60 లక్షల నుండి 2.70 లక్షల కిలోల పూలు అవసరమవుతాయి. సగటున రోజుకు 300 కిలోల పూలను నిత్య దీప నైవేద్య సేవలకు ఉపయోగిస్తారు. తిరుమల ఆలయంతో పాటు స్థానిక ఆలయాలకు కూడా కలిపి ఏడాదికి మొత్తం 3 లక్షల కిలోల పూలను ఈ శాఖ సరఫరా చేస్తోంది.

విశేషమేమిటంటే, కేవలం స్థానికంగా దొరికే పూలే కాకుండా.. ప్రత్యేక పర్వదినాల్లో బ్యాంకాక్, మలేషియా, ఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాల నుండి కూడా విదేశీ పూలను తెప్పిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం రోజున జరిగే పుష్పయాగం కోసం 18 రకాల పూలు, 6 రకాల పత్రాలను ఉపయోగిస్తారు. ఆ ఒక్క రోజే దాదాపు 10 టన్నుల పూలను స్వామివారికి సమర్పిస్తారు. ఈ పూలను టీటీడీ సొంత తోటల నుండి సేకరించడమే కాకుండా, భక్తుల విరాళాల ద్వారా, రైతుల సంఘాల నుండి కూడా సేకరిస్తుంది.

కేవలం ఆలయం లోపలే కాకుండా, తిరుమల వచ్చే భక్తులకు కనువిందు చేసే గీతోపదేశం పార్క్, నామాల పార్క్, గరుడ సర్కిల్ వంటి ప్రాంతాలను దాతల సహకారంతో ఉద్యానవన శాఖ ఎంతో సుందరంగా తీర్చిదిద్దింది. గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ విభాగం ప్రకృతి సౌందర్యాన్ని కాపాడుతూ, తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story