Tirumala: తిరుమల : ఉదయాన్నే సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి రోజువారీ దివ్య చర్య!
శ్రీవారి రోజువారీ దివ్య చర్య!

Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి క్షేత్రంలో వేంకటేశ్వర స్వామివారికి రోజువారీగా జరిగే నిత్య కైంకర్యాలు అత్యంత వైభవంగా, పవిత్రంగా జరుగుతాయి. వేద మంత్రాలు, పుష్పాల సువాసనలు, ఘంటానాదాల నడుమ స్వామివారి దినచర్య తెల్లవారుజామున మొదలై అర్థరాత్రి ఏకాంత సేవతో ముగుస్తుంది.
1. సుప్రభాత సేవ (తెల్లవారుజామున 3:00 – 3:30)
ఆలయ అర్చకులు, జీయంగార్లు, వేద పండితులు బంగారు వాకిలి ముందుకు చేరుకోవడంతో స్వామివారి రోజువారీ దివ్యచర్య ప్రారంభమవుతుంది. "కౌసల్యా సుప్రజా రామా..." అంటూ సాగే శ్రీ వేంకటేశ్వర సుప్రభాతాన్ని పఠిస్తూ స్వామివారిని మేల్కొలుపుతారు. సయనాగారంలో విశ్రమించిన భోగ శ్రీనివాసమూర్తిని తిరిగి గర్భగుడిలోని మూలవిరాట్టు వద్దకు వేంచేపు చేస్తారు
2. తోమాల సేవ (తెల్లవారుజామున 3:30 – 4:00)
సుప్రభాతం పూర్తయ్యాక ఆలయ శుద్ధి జరుగుతుంది. ఆ తర్వాత సుగంధ భరితమైన వివిధ రకాల రంగురంగుల పూలదండలతో శ్రీవారిని అలంకరిస్తారు. తోమాల అంటే పూలదండలు అని అర్థం. ఈ సేవలో స్వామివారికి అందమైన పుష్పాలంకరణ చేస్తారు.
3. కొలువు సేవ (ఉదయం 4:00 – 4:15)
తోమాల సేవ ముగిసిన వెంటనే స్నాపన మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి సమక్షంలో 'కొలువు' దర్బార్ జరుగుతుంది. ముందురోజు ఆలయానికి వచ్చిన ఆదాయం, ఖర్చుల లెక్కల వివరాలను స్వామివారికి వినిపిస్తారు. ఆ రోజు పంచాంగ శ్రవణాన్ని కూడా భక్తిశ్రద్ధలతో పఠిస్తారు.
4. మొదటి అర్చన (ఉదయం 4:15 – 5:00)
ఈ సమయంలో స్వామివారికి సహస్రనామార్చన (వెయ్యి నామాలతో పూజ) నిర్వహిస్తారు. స్వామివారి నామాలను స్మరిస్తూ ఆయన పవిత్ర పాదాల వద్ద తులసి దళాలను అర్పిస్తారు.
5. మొదటి బెల్ & నైవేద్యం (ఉదయం 5:30 – 6:00)
అర్చన పూర్తయ్యాక స్వామివారికి మొదటి నివేదన (నైవేద్యం) సమర్పిస్తారు. ఆలయంలో పెద్ద గంటలు మోగించి మహా నివేదనతో పాటు బలిహరణ ప్రక్రియ పూర్తి చేస్తారు.
6. సర్వదర్శనం & అర్జిత సేవలు (ఉదయం 6:00 నుంచి సాయంత్రం వరకు)
నైవేద్యం అనంతరం సామాన్య భక్తుల దర్శనం (సర్వదర్శనం) ప్రారంభమవుతుంది. దీనితో పాటు రోజంతా వివిధ రకాల ఆర్జిత సేవలు జరుగుతాయి
కల్యాణోత్సవం: స్వామి, అమ్మవార్ల దివ్య కల్యాణం ఉదయం 10:00 గంటలకు జరుగుతుంది.
డోలోత్సవం (ఊంజల్ సేవ): మధ్యాహ్నం 1:00 గంటకు ఊయల సేవ చేస్తారు.
ఆర్జిత బ్రహ్మోత్సవం & వసంతోత్సవం: మధ్యాహ్నం వేళల్లో ఈ సేవలను నిర్వహిస్తారు.
7. సహస్ర దీపాలంకరణ సేవ (సాయంత్రం 5:00 – 6:00)
సాయంత్రం వేళ వైభవోత్సవ మంటపంలో వేల దివ్యమైన ప్రమిద దీపాల కాంతుల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారిని ఊయలలో వేంచేపు చేసి పాటలు, మంగళవాయిద్యాలతో సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహిస్తారు.
8. రాత్రి పూజలు & నైవేద్యం (రాత్రి 7:00 – 8:00)
సాయంత్రం మరోసారి ఆలయ శుద్ధి చేసి, స్వామివారికి రాత్రి అర్చన మరియు రెండో నైవేద్యాన్ని సమర్పిస్తారు.
9. ఏకాంత సేవ (రాత్రి 1:00 – 1:30)
రోజంతా భక్తులకు అభయమిచ్చిన శ్రీనివాసుడు రాత్రి విశ్రమించేందుకు చేసే సేవయే ఏకాంత సేవ (పవళింపు సేవ). సయనాగారంలో పట్టు పరుపులు పరిచిన ఊయలలో భోగ శ్రీనివాసమూర్తిని వేంచేపు చేస్తారు. తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి ఇస్తారు. అన్నమయ్య జోలపాట, లాలీపాటల సంగీత స్వరాంజలి మధ్య స్వామివారు నిద్రకు ఉపక్రమించడంతో ఆ రోజు కైంకర్యాలు ముగుస్తాయి.

