Tirumala Tirupati Devasthanam: జూలై 15, 16 తేదీల్లో ఆర్జితసేవలు, VIP బ్రేక్ దర్శనాలు రద్దు
ఆర్జితసేవలు, VIP బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Tirupati Devasthanam: ఆణివార ఆస్థానం కారణంగా జూలై 16న కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.జూలై 15 మరియు జూలై 16 తారీఖుల్లో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం మరియు ఆణివార ఆస్థానం ఉన్న కారణంగా ఈ రెండు రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించిన సిఫార్సు లేఖలు జూలై 14 మరియు జూలై 15 తారీఖుల్లో స్వీకరించబడవు. భక్తులు ఈ అంశాలను గమనించి టిటిడి కి సహకరించవలసిందిగా కోరింది. మరోవైపు తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం యాగశాల పూజ, హోమం, మహా పూర్ణాహుతి, కలశోధ్వాసన, మూలవర్లకు కలశాభిషేకం, పట్టుపవిత్ర సమర్పణ చేపట్టారు. మధ్యాహ్నం 03.00 – 03.30 గం.ల మధ్య అభిషేకం, అనంతరం అలంకారం, సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం పంచమూర్తులైన శ్రీ వినాయక స్వామి, వళ్లి దేవసేన సమేత శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ చండికేశ్వరస్వామివారి తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
