Tirumala Tirupati Devasthanams Announces: టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన బుధవారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన సమావేశంలో భక్తుల సౌకర్యార్థం, హిందూ ధర్మ ప్రచారమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో సర్వదర్శనం క్యూలైన్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా రూ.4.55 కోట్లతో అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి, వరాహస్వామి విశ్రాంతి భవనంలో రూ.3.61 కోట్లతో అభివృద్ధి పనులకు బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే, తిరుమలలోని రోడ్లు, సర్కిళ్లకు ఆధ్యాత్మిక, పురాణ ప్రాశస్త్యం కలిగిన పేర్లు పెట్టాలని నిర్ణయించారు. నీటి వృధాను అరికట్టేందుకు గోగర్భం డ్యామ్ నుండి ఫిల్టర్ ప్లాంట్ వరకు రూ.6 కోట్లతో కొత్త పైపులైన్ నిర్మించనున్నారు.

విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుల కోసం టీటీడీ విద్యాసంస్థలకు అదనంగా రూ.43.40 కోట్లు మంజూరు చేస్తూ, మొత్తం కేటాయింపులను రూ.161.40 కోట్లకు పెంచింది. శ్రీవారి సేవలో తరిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ, వారందరికీ శ్రీవారి దర్శనం మరియు లడ్డూ కార్డులు జారీ చేయాలని బోర్డు నిర్ణయించింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రతలో భాగంగా హెల్త్ స్కీమ్ రీఎంబర్స్మెంట్ పరిమితిని రూ.3 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచుతూ ఆమోదం తెలిపారు. అలాగే వినికిడి లోపం ఉన్న 150 మంది పిల్లలకు 'శ్రవణం' ప్రాజెక్టు ద్వారా ఉచితంగా వినికిడి యంత్రాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు.

ఆలయాల నిర్మాణం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన బోర్డు, రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెంకటపాలెం శ్రీవారి ఆలయంలో రూ.36.95 కోట్లతో ఏడు అంతస్తుల మహా రాజగోపురం మరియు ఇతర మండపాలు నిర్మించనుంది. అలాగే గుంటూరు జిల్లా అనంతవరంలో రూ.2.71 కోట్లతో రాజగోపురం, ఖమ్మంలో తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల్లో కొత్త ఆలయ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. అల్లూరు సీతారామరాజు జిల్లా వర్థనపల్లిలో శివాలయ నిర్మాణానికి రూ.55 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. సనాతన ధర్మ వ్యాప్తి కోసం "అక్షర గోవిందం" కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులకు ఉచితంగా కిట్లను అందించనున్నారు.

ముంబైలో నూతనంగా నిర్మించిన శ్రీవారి ఆలయానికి అవసరమైన సిబ్బంది నియామకం, పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి బోర్డు సభ్యుడు సౌరబ్ బోరా విరాళం అందించడం వంటి అంశాలపై కూడా చర్చించారు. తిరుపతి అలిపిరి వద్ద రూ.4.75 కోట్లతో శ్రీనివాస దివ్యానుగ్ర‌హ హోమం కోసం యాగశాల, బస్సుల తనిఖీల కోసం రూ.4.25 కోట్లతో శాశ్వత షెల్టర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు పద్మశ్రీ డాక్టర్ శోభారాజును టీటీడీ ఆస్థాన విద్వాంసురాలిగా నియమించాలని, రాష్ట్రంలోని చిన్న ఆలయాలకు ఇచ్చే ధూపదీప నైవేద్యాల మొత్తాన్ని రూ.5 వేల నుండి రూ.10 వేలకు పెంచాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story