Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం సాయంత్రం స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనమిచ్చి అనుగ్రహించారు.

కన్నులపండువగా స్వర్ణరథోత్సవం

మంగళవాయిద్యాల నడుమ స్వర్ణరథోత్సవం కన్నులపండువగా సాగింది. స్వామివారి దర్శనం కోసం తిరుమాడ వీధులకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు “గోవిందా.. గోవిందా..” అంటూ గోవిందనామస్మరణతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

స్వర్ణకాంతులతో మెరిసిన రథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు.

భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన మహిళలు

స్వర్ణరథోత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని భక్తిశ్రద్ధలతో లాగారు. మహిళల భక్తి, గోవిందనామస్మరణ, మంగళవాయిద్యాల నడుమ స్వర్ణరథం తిరుమాడ వీధుల్లో ముందుకు సాగడం ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

శ్రీవారి స్వర్ణరథానికి ఆధ్యాత్మిక విశిష్టత

శ్రీవారి స్వర్ణరథోత్సవానికి ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానం ఉంది. శ్రీదేవి సంపదకు, భూదేవి సమస్త ధాన్యసంపదకు ప్రతీకలుగా భావిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై విహరించడం స్వామివారి వైభవం, సార్వభౌమత్వానికి ప్రతీకగా భక్తులు విశ్వసిస్తారు.

స్వర్ణరథోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో దర్శించుకోవడం ద్వారా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి అనుగ్రహంతో సకల శుభాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ధాన్యసమృద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం.

Next Story