Srivari Brahmotsavams: బ్రహ్మోత్సవాలకు తిరుపతిలో పటిష్ట ఏర్పాట్లు
పటిష్ట ఏర్పాట్లు

Srivari Brahmotsavams: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు టీటీడీ, తిరుపతి జిల్లా యంత్రాంగం, పోలీసు తదితర అన్ని శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ తదితర అధికారులతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టిటిడి అదనపు ఈవో మంగళవారం తిరుపతిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో భక్తులు సౌకర్యవంతంగా స్వామివారి వాహనసేవలను వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు, అన్నప్రసాదం, తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి సౌకర్యాలు, ప్రజా రవాణా వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీ, పరిస్థితులకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకునేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం, టీటీడీ, పోలీసు, మున్సిపల్, రవాణా, ఆరోగ్య తదితర శాఖలు ఒకే బృందంగా పనిచేసేలా కమాండ్ కంట్రోల్ వ్యవస్థను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.
గత బ్రహ్మోత్సవాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు, అదనపు ఏర్పాట్లు చేపట్టామని, భక్తుల భద్రత, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారంపై తక్షణమే స్పందించేలా ప్రత్యేక రెస్పాన్సివ్ టీమ్, అలాగే విపత్తు నిర్వహణ, అత్యవసర స్పందన బృందాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం, టీటీడీ సమన్వయంతో రానున్న బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమష్టిగా కృషి చేస్తాయని ఆయన వివరించారు.

