Goddess Durga Adorned as Saraswati: ఇవాళ సరస్వతీ అలంకారంలో దుర్గమ్మ
సరస్వతీ అలంకారంలో దుర్గమ్మ

Goddess Durga Adorned as Saraswati: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ దుర్గమ్మ జన్మ నక్షత్రమైన మూలా సందర్భంగా సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి, అంతరిక్ష, మహా సరస్వతులనే సప్త నామాలతో పూజలందుకునే ఆ చదువుల తల్లి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని అని నమ్మకం. ఈ రోజు అమ్మను తెలుపు వస్త్రం, తెల్లని పూలతో పూజించాలి. నైవేద్యంగా దద్యోజనం సమర్పించాలి.
ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు పుస్తక రూపిణీ సరస్వతీ అలంకారంలో భక్తులను కటాక్షిస్తున్నారు. ఉదయం భద్రపీఠ సేవ, సాయంత్రం 7 గంటలకు అశ్వవాహన సేవ, కాళరాత్రి దుర్గార్చన, రథోత్సవాన్ని అర్చకులు నిర్వహిస్తారు. భక్తులు భారీగా తరలిరావడంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.
కనకదుర్గాదేవి జన్మనక్షత్రం మూలా. శరన్నవరాత్రుల్లో సరస్వతీ రూపంలోని అమ్మవారిని దర్శించి, పూజిస్తే పాండిత్యం, జ్ఞానం, వాక్సుద్ధి, వాక్సిద్ధి వస్తాయి. శ్రీ సరస్వతీదేవి విద్య, సంగీత సాహిత్యాల అధిదేవత. విద్యార్థులు అమ్మవారి అనుగ్రహం పొందేందుకిది శుభసమయం. గురువు నుంచి ఐం అనే బీజాక్షరం మంత్రంగా ఉపదేశం పొంది జపం చేయడం శుభకరమని గరుడపురాణంలో శ్రీవేదవ్యాసులు వచించారు.
శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీశైల భ్రమరాంబాదేవి ఇవాళ మహాగౌరి అలంకారంలో దర్శనమిస్తారు. స్వామి, అమ్మవార్లకు అర్చకులు నంది వాహన సేవ, మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్వం శివుడి కోసం ఘోరమైన తపస్సు చేసి శరీరం రంగు కోల్పోయిన అమ్మవారిని పాలతో అభిషేకం చేయగా శ్వేతవర్ణంలో మెరిసిపోయిందంట. ఈ రూపాన్ని మహాగౌరి అంటారు. ఈ అమ్మవారిని పూజిస్తే గత, ప్రస్తుత జన్మ పాపాలు నశిస్తాయని నమ్మకం.
