Atla Taddi: నేడే అట్ల తద్ది.. ఏం చేయాలంటే?
ఏం చేయాలంటే?

Atla Taddi: ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొనే అట్ల తద్దికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇది గౌరీదేవిని పూజించే వ్రతం. మాంగల్య సౌభాగ్యం, కుటుంబ సుఖశాంతులను కోరి నేడు గౌరీదేవిని పూజిస్తారు. చంద్రోదయ వేళలో ఉమాదేవి వ్రతం నిర్వహిస్తారు. దీనివల్ల ఆదర్శ దాంపత్యానికి ప్రతీకలైన శివపార్వతుల అనుగ్రహం, గౌరీ దేవి కరుణ లభిస్తుందని పండితులు చెబుతున్నారు. స్త్రీలు తప్పక ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించాలని సూచిస్తున్నారు.
ఈ శుభదినాన పెళ్లికాని అమ్మాయిలు ఆనందంతో ఉయ్యాల ఊగితే సుగుణాలు గల వ్యక్తి భర్తగా వస్తాడని పండితులు చెబుతున్నారు. యుక్త వయస్సు గల ఆడపిల్లలు నేడు ఆటపాటలతో ఆనందంగా గడిపితే గౌరీదేవికి సేవ చేసినట్లేనని పురాణాలు చెబుతున్నాయి. ఫలితంగా అమ్మవారి అనుగ్రహం లభించి కోరుకున్న వరుడు సొంతమవుతాడని నమ్మకం.
అట్ల తద్ది రోజున గౌరీదేవికి ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. ఈ పూజలో భాగంగా.. పీఠంపై బియ్యం పోయాలి. దానిపై తమలపాకులు ఉంచి, పసుపుతో చేసిన గౌరీదేవిని ప్రతిష్ఠించాలి. పసుపు, కుంకుమ, పూలు, గంధం ఉపయోగించి, అమ్మవారికి అర్చన చేయాలి. అట్లు, ఇతర నైవేద్యాలను సమర్పించాలి. ముగ్గురు/ఐదుగురు ముత్తైదువులకు వాయినం ఇచ్చి, ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేస్తే.. గౌరీదేవి అనుగ్రహంతో స్త్రీలకు సర్వసుఖాలు కలుగుతాయని ప్రతీతి.
