Today Is Gita Jayanti: ఇవాళ గీతా జయంతి.. అంటే భగవద్గీత ఆవిర్భవించిన రోజు
అంటే భగవద్గీత ఆవిర్భవించిన రోజు

Today Is Gita Jayanti: హిందువులకు అత్యంత పవిత్రమైన గ్రంథమైన శ్రీమద్ భగవద్గీత ఆవిర్భవించిన రోజు ఈ రోజు. భారత ఇతిహాసంలో భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు మొత్తం 18 అధ్యాయాలను భగవద్గీతగా చెబుతారు. ఇందులో మొత్తం 700 శ్లోకాలు ఉంటాయి. ఇవి మనం ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నేర్పుతాయి.
పురాణేతిహాసాలెన్ని ఉన్నా అవేవీ చదవకపోయినా ఒక్క భగవద్గీత చదివితే చాలంటారు. అంతటి జ్ఞానాన్ని ప్రసాదించే పవిత్ర గ్రంథం ఆవిర్భవించింది ఈ రోజే.అందుకే ఇవాళ గీతా జయంతి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున చాలా మంది భగవద్గీత పారాయణం చేస్తారు, శ్రీకృష్ణుడిని ఆరాధిస్తారు, గీతా సారాన్ని గురించి చర్చించుకుంటారు.‘ఫలాన్ని ఆశించక కర్తవ్యాన్ని నిర్వర్తించు’ అనే సిద్ధాంతాన్ని గీత బోధిస్తుంది. మనల్ని కర్తవ్యం వైపు నడిపిస్తుంది. జీవితంలో గీతా సారాన్ని ఆచరిస్తే పరాజయం ఉండదనడానికి మహాభారతమే నిదర్శనం
గీతా జయంతి విశిష్టత
సమయం: ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున దీనిని పాటిస్తారు.
ప్రాముఖ్యత: కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు విషాదంలో మునిగిన అర్జునుడికి ఉపదేశించిన దివ్య జ్ఞానమే భగవద్గీత.
బోధన: ఈ ఉపదేశం కేవలం అర్జునుడికే కాకుండా, జీవితంలో కర్తవ్య నిర్వహణలో సందిగ్ధతకు లోనయ్యే ప్రతి మనిషికి మార్గదర్శకంగా, ఆచరణాత్మక జీవన విధానాన్ని బోధిస్తుంది.
ముఖ్య సందేశం: నిష్కామ కర్మ సిద్ధాంతం (ఫలితాన్ని ఆశించకుండా, తమ విధిని అత్యంత నిబద్ధతతో నిర్వర్తించడం) దీనిలో ప్రధానమైంది.
భగవద్గీత సారం
కర్మయోగం: ఫలం ఆశించకుండా కర్మలను ఆచరించడం. (నిష్కామ కర్మ)
భక్తియోగం: భగవంతుడిపై సంపూర్ణ విశ్వాసం , ప్రేమ.
జ్ఞానయోగం: ఆత్మ, పరమాత్మ గురించి సరైన జ్ఞానాన్ని పొందడం.
ధర్మం: వ్యక్తి యొక్క విధి, నైతిక బాధ్యత.
గీతా జయంతి రోజున, భక్తులు గీతను పూర్తిగా పారాయణం చేయడం, ఉపవాసాలు ఉండడం, శ్రీకృష్ణ ఆలయాలను సందర్శించడం ,గీత సందేశాలను చర్చించుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

