Gopashtami: నేడు గోపాష్టమి.. గోమాత పూజతో 33 కోట్ల దేవతల ఆశీస్సులు
దేవతల ఆశీస్సులు

Gopashtami: కార్తీక మాసం శుక్ల పక్ష అష్టమి తిథి నేడు (నవంబర్ 17) గోపాష్టమిగా జరుపుకుంటున్నారు. ఈ పవిత్ర దినాన గోమాతను పూజించడం వల్ల 33 కోట్ల దేవతల ఆశీస్సులు లభిస్తాయని స్కంద పురాణం చెబుతోంది. హిందూ సంప్రదాయంలో గోవు కేవలం జంతువు కాదు. ఆవులో వేదాలు, కొమ్ముల్లో శివుడు-విష్ణువు, పాదాల్లో పితృదేవతలు కొలువై ఉంటారని పురాణాలు వివరిస్తున్నాయి.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘గవాం మధ్యే వసామ్యహం’ అని చెప్పాడు. అంటే తాను గోవుల మధ్యనే ఉంటానని. అందుకే ఒక్క గోవును పూజిస్తే 33 కోట్ల దేవతలను పూజించినంత ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు. జన్మజన్మల పాపాలు తొలగి ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని విశ్వసిస్తారు.
ద్వాపర యుగంలో చిన్ని కృష్ణుడు ఆరేళ్ల వయసులో మొదటిసారి పెద్ద ఆవులను అడవికి తోలుకెళ్లిన రోజు కార్తీక శుక్ల అష్టమి. అప్పటి నుంచే ఆయనకు గోపాలుడు, గోవిందుడు అనే పేర్లు స్థిరపడ్డాయి. ఈ రోజునే గోపాష్టమి వచ్చింది. నేటి తిథి తెల్లవారుజామున 4:20 గంటలకు ప్రారంభమై రేపు ఉదయం 6:06 గంటలకు ముగుస్తుంది. కాబట్టి నేడే పూజలు చేయాలని పండితులు సూచిస్తున్నారు.
పూజా విధానం ఇలా ఉంటుంది. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఆవు, దూడలకు స్నానం చేయించి పూలమాలలు, పసుపు, కుంకుమ, గోటాతో అలంకరించాలి. నుదుటన పసుపు-కుంకుమ-చందనంతో బొట్టు పెట్టాలి. కొమ్ములకు పూలు అలంకరించాలి. గోవు ముందు ధూపం, దీపం వెలిగించి శ్రీకృష్ణుడి ప్రతిమతో పూజ చేయాలి. వెన్న, మీగడ నైవేద్యం సమర్పించాలి. గోవు తోక భాగాన్ని స్పృశించి నమస్కరించాలి. వెనుక నుంచి కర్పూర హారతి ఇవ్వాలి.
ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి. గోవుకు పచ్చగడ్డి, బెల్లం, అరటిపండ్లు, రోటీలు తినిపించాలి. గోవు తిన్న తర్వాతే భోజనం చేయాలి. ఈ రోజు పాలు, పాల ఉత్పత్తులు తినకూడదు. ఇంట్లో ఆవు లేని వారు సమీప గోశాలకు వెళ్లి గడ్డి దానం చేయవచ్చు. గోశాల మట్టిని నుదుటన బొట్టుగా పెట్టుకోవడం కూడా శుభప్రదం.
ఈ రోజు గోవును, దూడను తిట్టడం లేదా కొట్టడం చేయకూడదు. తామసిక ఆహారం, మాంసం, మద్యం నుంచి దూరంగా ఉండాలి. వాదనలు, గొడవలకు దూరంగా ఉండాలి. గోమాతను పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. గోసంరక్షణ, ప్రకృతి పట్ల కృతజ్ఞతను చాటే పర్వదినంగా గోపాష్టమిని జరుపుకోవాలి.
నేటి గోపాష్టమి పూజలు చేసి గోమాత ఆశీస్సులు పొందండి. కుటుంబాల్లో సంపద, ఆరోగ్యం, సంతోషం నెలకొనాలని అందరూ కోరుకుంటున్నారు.

