TTD: డిసెంబర్ 20 నుండి 29వ తేది వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో గురువారం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించి అత్యంత విజయవంతంగా నిర్వహించిన ఉత్సాహంతో ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలను కూడా విజయవంతం చేసేందుకు కృషి చేయాలని చెప్పారు.

అధికమంది సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు గత వైకుంఠ ద్వార దర్శనాల్లో చేసిన విధంగానే తొలి మూడు రోజులకు ఆన్ లైన్ లో ఈ-డిప్ ద్వారా ఎస్ఎస్డీ టోకెన్లు కేటాయించాలని చెప్పారు. తర్వాతి ఏడు రోజులు సర్వ దర్శనం అమలు చేయాలని తెలిపారు. డిసెంబర్ 25వ తేది శుక్రవారం రోజున స్వామివారి అభిషేక సేవ సమయంలో కూడా సర్వ దర్శనం భక్తులకు దర్శనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు దర్శన క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ సామాన్య భక్తులకు వీలైనంత త్వరగా స్వామివారి దర్శనం కలిగేలా పగడ్భందీ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశికి పగడ్భందీ భద్రతా ఏర్పాట్లు చేపడతామని చెప్పారు. తిరుమలలో పార్కింగ్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చివరి ఏడు రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగిన విధంగా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.

Next Story