TTD: ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో జిల్లా, పోలీసులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పని చేసి కట్టుదిట్టమైన ప్రణాళికలతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అదనపు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ శ్రీ సుబ్బారాయుడులతో కలిసి ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా టీటీడీ బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అదనపు ఈఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నాణ్యతలో రాజీ పడకుండా రుచికరమైన అన్న ప్రసాదాలను తయారు చేసి భక్తులకు పంపిణీ చేయాలన్నారు. భక్తుల భద్రతకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ గా పెట్టుకోవాలని చెప్పారు. గరుడ వాహనం రోజున అధిక మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అందుకు తగిన విధంగా ఆర్టీసీ బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేయాలన్నారు. స్వామివారికి నిస్వార్థంగా సేవలందించే శ్రీవారి సేవకులను గుర్తించి వారి సేవలను బ్రహ్మోత్సవాలకు వినియోగించుకోవాలని చెప్పారు.

అనంతరం ఈవో అధికారులతో కలిసి శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులను తనిఖీ చేసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

తనిఖీల అనంతరం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది అధిక మాసం కారణంగా సెప్టెంబరులో సాలకట్ల, అక్టోబరులో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నందున జిల్లా యంత్రాంగం, పోలీసు, టీటీడీ విభాగాల మధ్య సమన్వయంతో సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించి, మిగిలిన పనులను సెప్టెంబర్ 14లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

ఏటా తిరుమలకు పెరుగుతున్న భక్తుల సంఖ్య, ఇటీవల రథసప్తమి సందర్భంగా సుమారు 3.75 లక్షల మంది భక్తులు, 15 వేల వాహనాలు వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీపై ముందస్తు అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో భక్తుల రద్దీ, వాహన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఆరోగ్యం, పారిశుద్ధ్యం, అన్నప్రసాదం, ఘాట్‌రోడ్ల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించినట్లు వివరించారు.

ముఖ్యంగా గరుడసేవకు అధిక ప్రాధాన్యతనిస్తూ, తిరుమలతో పాటు తిరుపతిలోనూ భక్తుల రాద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. గత బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున సుమారు 20 లక్షల ఫుడ్ పోర్షన్లు, వివిధ రకాల పానీయాలతో పాటు 15 రకాల మెనూలను భక్తులకు అందించినట్లు తెలిపారు. ఈ ఏడాది భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు వంటశాలల ఏర్పాటుతోపాటు అవసరమైన నిత్యావసర సరుకుల సేకరణ, రవాణా ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు.

అదేవిధంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విపత్తు, సంక్షోభ నిర్వహణ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటుపై చర్చించినట్లు తెలిపారు. పోలీసు శాఖ తరపున అవసరమైన సిబ్బంది నియామకం, వారికి వసతి, విధుల కేటాయింపుపై ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. టీటీడీ విజిలెన్స్ విభాగం, సీవీఎస్వో ఆధ్వర్యంలో గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని భద్రతా సిబ్బంది మోహరింపుపై నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు.

బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దేశంలోని 25 రాష్ట్రాల నుంచి 27 కళాబృందాలు పాల్గొననున్నాయని, ఇందులో రెండు విదేశీ కళాబృందాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఎస్వీబీసీ, సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బ్రహ్మోత్సవాల విశేషాలను కోట్లాది మంది భక్తులకు చేరేలా విస్తృత ప్రచార ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.

అన్ని శాఖలు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, పరస్పరం సమన్వయం చేసుకుని ఒకే బృందంగా పనిచేయడం ద్వారా బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు ఈవో తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story