TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు
ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు

TTD: కలియుగ వైకుంఠం తిరుమలలో ప్రసిద్ధమైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
బ్రహ్మోత్సవాల జరిగే తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో నిర్వహించే పలు ఆర్జిత సేవలను పూర్తిగా రద్దు చేసినట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. రద్దయిన సేవల జాబితాలో ఇవి ఉన్నాయి:
అష్టదళ పాదపద్మారాధన సేవ తిరుప్పావడ సేవ ఆర్జిత కల్యాణోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ
ఆర్జిత సేవలతో పాటు, బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రత్యేక దర్శన కేటగిరీలను కూడా టీటీడీ నిలిపివేసింది. ఈ ఉత్సవాలలో వృద్ధులు (సీనియర్ సిటిజన్లు), దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐల దాతల ప్రత్యేక దర్శనాలు రద్దు చేయబడ్డాయి.
ఉత్సవాల సమయంలో తిరుమలకు విచ్చేసే భక్తులు ఈ మార్పులను గమనించాలని, స్వామివారి బ్రహ్మోత్సవాల విజయవంతానికి టీటీడీకి తగిన విధంగా సహకరించాలని కోరారు. భక్తులు ఈ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

