Vaikuntha Dwara Darshan: వైకుంఠ ద్వార దర్శనాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ: ఛైర్మన్ బీఆర్ నాయుడు
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ: ఛైర్మన్ బీఆర్ నాయుడు

Vaikuntha Dwara Darshan: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ, గత అనుభవాల ఆధారంగా ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనుంది.
తిరుమలలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన వివరిస్తూ, ‘‘మొదటి మూడు రోజులు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా టోకెన్లు జారీ చేశాం. మిగతా ఏడు రోజుల్లో సాధారణ భక్తులు టోకెన్ లేకుండానే సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం పొందవచ్చు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాట్లు, సౌకర్యాలపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది’’ అని తెలిపారు.
దాత మంతెన రామలింగరాజు సహకారంతో పీఏసీలను ఆధునిక సదుపాయాలతో మెరుగుపరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఆయన రూ.9 కోట్ల విరాళం అందజేశారు. అలాగే, ఆలయ ధ్వజస్తంభాల కోసం 100 ఎకరాల్లో టీటీడీ స్వయంగా దివ్య వృక్షాలు పెంచే ప్రతిపాదన ఉందని, పలమనేరులోని టీటీడీ గోశాల ప్రాంగణాన్ని ఈ ప్రాజెక్టుకు అనువైన స్థలంగా ఎంపిక చేశామని వివరించారు.
మంగళవారం టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుందని, 50 అజెండా అంశాలపై చర్చించి, దివ్య వృక్షాల ప్రాజెక్టుపై నిర్ణయం ప్రకటిస్తామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.

