టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితరం

TTD Executive Officer Anil Kumar Singhal: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో మార్చి నెలాఖరు నుండి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో టిటిడి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ప్రస్తుతం టిటిడిలోని 56 ఆలయాలలో అన్నప్రసాద వితరణ కొనసాగుతోందని, మార్చి నెలాఖరునాటికి అన్ని ఆలయాలలో రెండు పూటలా అన్నప్రసాద వితరణ జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. అదేవిధంగా, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో టిటిడి ఆలయాల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలన్నారు. అస్సాం రాష్ట్రంలోని గౌహతి, బీహార్‌లోని పాట్నా, తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని బెల్గాం ప్రాంతాలలో టిటిడి ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి నిర్మాణాలకు స్థలాలను కూడా కేటాయించినట్లు పేర్కొన్నారు. సంబంధిత రాష్ట్రాల అధికారులతో టిటిడి అధికారులు చర్చించి, కేటాయించిన స్థలాలను స్వాధీనం చేసుకునే అంశాన్ని రాబోయే పాలక మండలి సమావేశం దృష్టికి తీసుకురావాలని సూచించారు.

అదేవిధంగా చెన్నైలో కేటాయించిన స్థలంలో ఆలయ నిర్మాణానికి అవసరమైన డిజైన్‌లు, పరిపాలనా అనుమతుల అంశాలను టిటిడి బోర్డు ఆమోదానికి తీసుకురావాలని ఆదేశించారు. రుషికేష్‌లోని పీఏసీ (Pilgrim Amenities Complex) కూలిపోయే స్థితిలో ఉందని పేర్కొంటూ, టిటిడి ఇంజనీరింగ్ అధికారులు పరిశీలన చేపట్టి వచ్చే ఫిబ్రవరి నెలలోపు నూతన పీఏసీ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

టిటిడిలోని ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏప్రిల్ మాసంలో పరీక్షలు నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేయాలని ఆదేశించారు. వేద పారాయణదారులుగా ఎంపికైన వారిలో 164 మందిని టిటిడి ఆలయాలలో నియమించగా, మిగిలిన 536 మందిని ఇతర ఆలయాలలో నియమించేందుకు వీలుగా ఫిబ్రవరి మాసంలో ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. టిటిడి ప్రమాణాలకు అనుగుణంగా 150 మంది అర్చకులకు, 68 మంది పోటు వర్కర్లకు ఫిబ్రవరి నెలలో మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగైన సదుపాయాలు, టిటిడి సేవలు, సమాచారం తదితర అంశాలపై భక్తుల నుండి వస్తున్న ఈ – మెయిల్స్‌ను విశ్లేషించి, పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు పంపాలని ఆదేశించారు. అలాగే భక్తులు కోరుతున్న తాజా సమాచారాన్ని టిటిడి వెబ్‌సైట్‌లో నిరంతరం అప్‌డేట్ చేయాలని సూచించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story