TTD Goshalas: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని గోశాలలను జంతు సంక్షేమం, పరిశుభ్రత, భద్రత, సౌకర్యాల పరంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి సూచించారు.

తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో శనివారం వంతారా సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. టీటీడీ గోశాలలు, జంతు సంరక్షణ కేంద్రాలను ఉచితంగా అభివృద్ధి చేసేందుకు వంతారా సంస్థ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా గోశాలల్లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతులపై సమావేశంలో చర్చించారు.

గోశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలి

ప్రస్తుతం ఉన్న గోశాలలను ఆధునీకరించడంతో పాటు పశువులకు మరింత సురక్షితమైన, పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని అదనపు ఈవో సూచించారు.

పశువులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరిగేలా గోశాల నిర్మాణం ఉండాలని, తగినంత గాలి, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మేత, నీటి వసతులతో పాటు పరిసరాల పరిశుభ్రతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

గోడలకు టైల్స్.. కొత్త గేట్లు

గోశాలల అభివృద్ధికి సంబంధించి వంతారా ప్రతినిధులు రూపొందించిన ప్రణాళికను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అదనపు ఈవోకు వివరించారు.

గోశాలల గోడలకు టైల్స్ ఏర్పాటు చేయడం, స్టీల్ నిర్మాణాలకు పెయింటింగ్ వేయడం, పక్షులు, ఇతర జంతువులు లోపలికి రాకుండా జీఐ మెష్ ఏర్పాటు చేయడం వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

అలాగే పాత గేట్ల స్థానంలో కొత్త స్టెయిన్‌లెస్ స్టీల్ గేట్లు ఏర్పాటు చేయడం, అవసరమైన చోట గోడలకు మరమ్మతులు చేయడం, పెయింటింగ్ తదితర పనులు చేపట్టనున్నట్లు వివరించారు.

గాలి, నీరు, డ్రైనేజీపై ప్రత్యేక దృష్టి

పశువుల కదలికలకు అనుగుణంగా గోశాలలో స్తంభాల మధ్య తగినంత దూరం ఉండేలా నిర్మాణాలు చేపట్టనున్నట్లు వంతారా ప్రతినిధులు తెలిపారు.

అదేవిధంగా గోశాలలో మంచి గాలి ప్రసరణ ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు మేత, నీటి సౌకర్యాలను మెరుగుపరచనున్నట్లు చెప్పారు. వ్యర్థాలు, మురుగునీరు నిల్వ ఉండకుండా సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

గోశాలల చుట్టుపక్కల మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కూడా చర్యలు చేపట్టనున్నట్లు వంతారా ప్రతినిధులు వివరించారు.

తిరుమలలోనే పాల ఉత్పత్తులకు ప్రణాళిక

స్వామివారి కైంకర్యాలకు అవసరమైన పాల ఉత్పత్తులను సాధ్యమైనంత వరకు తిరుమలలోనే ఉత్పత్తి చేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అదనపు ఈవో సూచించారు.

స్వామివారి కైంకర్యాలకు అవసరమైన పాలు, ఇతర పాల ఉత్పత్తులను తిరుమలలోనే సమకూర్చుకునే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. ఇందుకోసం గోశాలలను కేవలం పశువుల సంరక్షణ కేంద్రాలుగా కాకుండా, గో సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సమగ్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు.

తిరుమలలో గోశాలల అభివృద్ధి ద్వారా పశువులకు మెరుగైన సంరక్షణ అందించడంతో పాటు, స్వామివారి కైంకర్యాలకు అవసరమైన పాల ఉత్పత్తులను స్థానికంగానే సమకూర్చుకునే విధంగా దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని అదనపు ఈవో స్పష్టం చేశారు.

Next Story