TTD Lands : టీటీడీ భూమిని ఒబేరాయ్‌కి దోచిపెడుతున్నారు
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం

- రూ.1500 కోట్ల విలువైన 20 ఎకరాల భూమి ధారాదత్తం చేసే కుట్ర
- అర్బన్‌లో ఉన్న టీటీడీ భూమితో రూరల్ లో ఉన్న టూరిజం భూమి ఎక్స్‌చేంజ్
- ఈ భూముల ఎక్స్‌చేంజ్ కారణంగా టీటీడీకి రూ. వెయ్యి కోట్ల నష్టం
తిరుపతిలో అత్యంత విలువైన తిరుమల తిరుపతి దేవస్ధానానికి చెందిన స్థలాన్ని ఒబేరాయ్ హోటల్‌కి అప్పగించేందుకు సీఎం చంద్రబాబు భారీ కుట్రకు తెరలేపారని.. అందులో భాగంగానే విలువైన దేవస్థానం భూమిని చవకైన టూరిజం స్థలంతో ఎక్స్‌చేంజ్‌కి అంగీకరిస్తూ జీవో ఇచ్చారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ భూ ఎక్స్‌ఛేంజ్ కారణంగా టీటీడీకి ప్రభుత్వ ధర ప్రకారమే రూ. వెయ్యి కోట్ల నష్టం వాటిల్లుందని ఆయన చెప్పారు. ఒకవేళ నిజంగా టూరిజం డెవలప్ చేయాలనుకుంటే రూరల్ ఏరియాలో ఉన్న స్థలంతో ఎక్స్‌చేంజ్ చేసుకుని ఉండాల్సిందని కరుణాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాకాకుండా వేల కోట్ల విలువైన టీటీడీ భూమితో మార్పిడి చేసుకోవడాన్ని చూస్తుంటే దీని వెనుక భారీ అవినీతి దాగి ఉందనే అనుమానం కలుగుతోందని ఆయన స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు అని, తిరుమల పవిత్రతను కాపాడతామని ప్రతిజ్ఞలు చేసిన చంద్రబాబు, సనాతన ధర్మాన్ని కాపాడటం అంటే స్వామి వారికి దాతలిచ్చిన ఆస్తులను దోచిపెట్టడమేనా అని కరుణాకర్ రెడ్డి నిలదీశారు. టీటీడీ భూమిని టూరిజం ల్యాండ్‌తో ఎక్స్‌చేంజ్ చేసుకోవడమే లక్ష్యంగా మే 7న సింగిల్ ఎజెండాతో టీటీడీ మీటింగ్ నిర్వహించి, దానిపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారని కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. ఆ తర్వాత 07.08.2025న టీటీడీ స్థలాన్ని టూరిజంకి, టూరిజం డిపార్ట్‌మెంట్ స్థలాన్ని టీడీకి ఇచ్చినట్టుగా జీవో ఇచ్చారని ఆయన వివరించారు. రూ. 1500 కోట్ల విలువైన 20 ఎకరాల టీటీడీ స్థలాన్ని టూరిజంకి అప్పగించి, టూరిజం నుంచి వేరే స్థలాన్ని తీసుకుంటున్నారు. అయితే గతంలో ఒకసారి ఒబెరాయ్ హోటల్ నిర్మాణాన్ని ఖండిస్తున్నామని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు టూరిజం డిపార్ట్ మెంట్‌తో ఎక్స్‌చేంజ్ చేసుకున్న స్థలాన్ని ఒబేరాయ్ హోటల్‌కి ఇచ్చే విధంగా పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ఇంకా చెప్పాలంటే గతంలో ఒబేరాయ్ హోటల్ నిర్మాణం చేయాలనుకున్న స్థలం కన్నా ఇంకా శ్రీవారి పాదాలకు దగ్గరగానే ఈ హోటల్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని చంద్రబాబు ఇప్పిస్తున్నారన్నారు. తిరుపతి అర్బన్ పరిధిలో ఉండే విలువైన భూమిని, రూరల్ పరిధిలో ఉన్న టూరిజం ల్యాండ్‌తో ఎక్స్‌చేంజ్ చేసుకోవడం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను అప్పనంగా దోచిపెట్టడమే అవుతుందన్నారు. ఆరోజు జరిగిన టీటీడీ సమావేశంలో రెండు రకాల భూముల విలువకు వ్యత్యాసం ఉందని పేర్కొంటూనే, వాటి విలువను ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించకుండా వదిలేశారని కరుణాకర్‌రెడ్డి గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు పరిపాలనలో బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. కోట్ల విలువైన టీటీడీ భూమి అన్యాక్రాంతం అవుతోందని ఇది ముమ్మాటికీ హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడిగా కరుణాకర్‌రెడ్డి అభివర్ణించారు. పైగా ఎవరో టీటీడీకి దానమిచ్చినట్టుగా చెబుతూ ఆ భూమిని ఇనాం భూమి అని టీటీడీ టేబుల్ అజెండాలో పేర్కొన్నారని మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
