TTD: సోషల్ మీడియాలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీకి) చెందిన శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల హాస్టల్‌పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది. కళాశాలలోని శాంభవి మరియు ప్రణతి బ్లాకుల్లో మరుగుదొడ్లు, స్నానపు గదులు వినియోగంలో లేవంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం టీటీడీ అధికారుల దృష్టికి వచ్చింది.

వాస్తవానికి శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలలో విద్యార్థినుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే కొత్తగా స్నానపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే, కొందరు కావాలనే దురుద్దేశంతో నిర్మాణంలో ఉన్న ఆ ప్రాంతాల ఫోటోలను తీసి, అవి పాడుబడినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీటీడీ స్పష్టం చేసింది. ఇది చాలా బాధాకరమైన విషయమని పేర్కొంది.

టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యాధునిక వసతులు కల్పించడంతో పాటు అత్యుత్తమ నాణ్యమైన విద్యను అందించేందుకు టీటీడీ నిరంతరం కృషి చేస్తోంది.

ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు సృష్టించి దుష్ప్రచారానికి పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ హెచ్చరించింది. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి నిరాధారమైన అసత్య ప్రచారాలను విద్యార్థులు, తల్లిదండ్రులు, భక్తులు ఎవరూ నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story