Tirumala Tirupati Devasthanams (TTD): తిరుమల లగేజీ డిపాజిట్, డెలివరీ ప్రక్రియను మరింత సులభతరం చేసిన టీటీడీ
సులభతరం చేసిన టీటీడీ

Tirumala Tirupati Devasthanams (TTD): తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లగేజీ డిపాజిట్, డెలివరీ ప్రక్రియను అత్యాధునిక సాంకేతికతతో మరింత సులభతరం చేసింది. లగేజీ కేంద్రాల్లో భక్తులు తమ సామాగ్రిని డిపాజిట్ చేసే సమయంలో సిబ్బంది సరికొత్త ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని (ముఖ గుర్తింపు సాంకేతికత) ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను జెనరేట్ చేసి, సదరు బ్యాగులపై స్టిక్కర్ల రూపంలో అంటిస్తారు. అనంతరం భక్తుల లగేజీ సమాచారంతో కూడిన ఒక రసీదును (స్లిప్) వారికి అందిస్తారు.
భక్తులు తమ దర్శనం ముగించుకున్న తర్వాత లగేజీ డెలివరీ కేంద్రానికి చేరుకుని, అక్కడ ఉన్న సిబ్బందికి ఈ స్లిప్‌ను చూపిస్తే సరిపోతుంది. రసీదుపై ఉన్న నంబర్ ఆధారంగా సిబ్బంది భక్తుల లగేజీని చాలా సులభంగా గుర్తించి, కేవలం ఒక నిమిషం లోపే తిరిగి భక్తులకు అందజేస్తున్నారు. ఈ సరికొత్త విధానం వల్ల లగేజీ కౌంటర్ల వద్ద భక్తులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఎలాంటి గందరగోళం లేకుండా సామాగ్రి సురక్షితంగా అందుతోంది.
ఈ నేపథ్యంలో తిరుమలకు విచ్చేసే భక్తులందరూ తమ వద్ద ఉన్న లగేజీ, బ్యాగులు, మొబైల్ ఫోన్లను కేవలం టీటీడీ అధికారిక డిపాజిట్ కేంద్రాల్లో మాత్రమే భద్రపరచాలని, అక్కడ ఇచ్చే టోకెన్ల ఆధారంగానే తిరిగి వాటిని పొందాలని టీటీడీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. దేశం నలుమూలల నుండి వచ్చే లక్షలాది మంది శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ అందిస్తున్న ఈ లగేజీ భద్రత మరియు డెలివరీ సేవలు పూర్తిగా ఉచితమని అధికారులు స్పష్టం చేశారు.

