TTD: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పింఛన్‌దార్లకు అందించే శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని న‌వంబ‌రు 7 నుండి 20వ తేదీ వ‌ర‌కు అందించ‌నున్నారు. తిరుపతిలోని టీటీడీ క్యాంటీన్ వ‌ద్ద గ‌ల కొత్త జాబిలి భ‌వ‌నంలో ఉద‌యం 10.30 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ప్ర‌సాదాలు పంపిణీ చేస్తారు. పింఛన్‌దార్లు త‌మ స్మార్టు కార్డు చూపి ఒక‌ పెద్ద లడ్డూ, ఒక‌ వడ పొంద‌వ‌చ్చు. పిపిఓ నంబ‌ర్ల వారీగా ప్ర‌సాదాల పంపిణీ జ‌రుగుతుంది. న‌వంబ‌రు 7న‌ 164 నుండి 3,250 వ‌ర‌కు, న‌వంబ‌రు 9 నుండి 13వ తేదీ వ‌ర‌కు 3,251 నుండి 9,050 వ‌ర‌కు, న‌వంబ‌రు 16 నుండి 19వ తేదీ వ‌ర‌కు 9,051 నుండి 12,550 వ‌ర‌కు, న‌వంబ‌రు 20న 12,551 నుండి మిగిలిన పింఛ‌న్‌దారులంద‌రికీ ప్ర‌సాదాలు అందిస్తారు. విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని కోరడమైనది.

సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకులు కీలక పాత్ర పోషిస్తూ, భక్తికి – సంప్రదాయానికి, దేవాలయానికి – సమాజానికి మధ్య ఆధ్యాత్మిక వారధులుగా నిలుస్తున్నారని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ పేర్కొన్నారు. టీటీడీ,హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 05 వరకు 15 రోజులపాటు నిర్వహించిన అర్చక శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశం గురువారం తిరుపతిలోని శ్వేత భవన్‌లో గల శ్రీ వెంగమాంబ సమావేశ మందిరంలో జరిగింది.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, సమాజంలో అర్చకులకు విశిష్టమైన గౌరవప్రదమైన స్థానం ఉందన్నారు. అర్చకత్వం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, తరతరాలకు ధర్మ సంప్రదాయాలను, ఆధ్యాత్మిక విలువలను అందించే పవిత్రమైన సేవ అని తెలిపారు. క్రమశిక్షణ, నిష్ఠ, భక్తి, సంప్రదాయాల పట్ల అవగాహనతో అర్చకులు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించాలని కోరారు. భగవంతుని సన్నిధిలో అన్ని వర్గాలకూ సమాన ప్రాధాన్యత ఉందని, అన్ని సామాజిక వర్గాల వారు అర్చకత్వాన్ని స్వీకరించి సనాతన ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రతి మనిషిని మరొకరితో పోలికలేని ప్రత్యేక వ్యక్తిత్వం, విభిన్న లక్షణాలతో సృష్టించడం దైవశక్తి గొప్పతనమని, ప్రతి ఒక్కరూ దైవానుగ్రహానికి అర్హులేనని, భగవంతుని కృపకు పాత్రులు కావాలంటే భక్తి, ధర్మాచరణ, సేవాభావంతో జీవించాలని ఆయన సూచించారు.

Next Story