Tulasi Pooja: తులసి పూజ: సాయంత్రం వేళ ఈ తప్పులు చేస్తున్నారా?
ఈ తప్పులు చేస్తున్నారా?

Tulasi Pooja: శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి. అందుకే దీనిని హరిప్రియ అని కూడా పిలుస్తారు. ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఆరోగ్యంగా ఉండి, నిత్యం పూజలందుకుంటుందో ఆ ఇంట్లో దారిద్య్రం ఉండదని, లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా సాయం సంధ్యా సమయంలో తులసి కోట వద్ద దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
సాయంత్రం తులసి ఆరతి - అనుసరించాల్సిన విధానం
తులసి మొక్క చుట్టూ చీకటిగా ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే సాయంత్రం ఇలా పూజించాలి..
దీపారాధన: ఆవు నెయ్యి లేదా ఆవ నూనెతో తులసి కోట ముందు దీపం వెలిగించాలి. ఆ దీపపు కాంతి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది.
షోడశోపచారాలు: ఆరతి ఇచ్చేటప్పుడు ధూపం వేసి.. పువ్వులు, అక్షతలు, గంధం, సింధూరాన్ని సమర్పించాలి. ఏదైనా పండు లేదా స్వీటును నైవేద్యంగా పెట్టాలి.
ప్రదక్షిణలు: ఆరతి పూర్తయిన తర్వాత భక్తితో తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మంత్రాలను జపించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది.
తులసి పూజలో అస్సలు చేయకూడని తప్పులు:
చాలామంది భక్తితో పూజ చేసినా తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. సాయంత్రం వేళ ఈ క్రింది పనులు చేయకూడదు:
మొక్కను తాకవద్దు: సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకడం గానీ, ఆకులను కోయడం గానీ అస్సలు చేయకూడదు. ఇది తులసి మాత నిద్రించే సమయమని నమ్ముతారు.
నీరు పోయవద్దు: తులసికి ఉదయం వేళ నీరు సమర్పించడం శుభప్రదం. కానీ సాయంత్రం దీపం పెట్టే సమయంలో నీరు పోయడం నిషిద్ధం.
జుట్టు విరబోసుకోవద్దు: మహిళలు తులసి పూజ చేసేటప్పుడు జుట్టును విరబోసుకోకూడదు. పద్ధతిగా జుట్టు ముడివేసుకుని లేదా క్లిప్ పెట్టుకుని పూజలో పాల్గొనాలి.
అక్షతల వాడకం: దీపం వెలిగించేటప్పుడు నేరుగా ప్రమిదలో కాకుండా, ప్రమిద కింద కొన్ని బియ్యం గింజలను ఉంచడం మంచిది.
ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తూ తులసి మాతను పూజిస్తే, మీ ఇంట్లో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు సూచిస్తున్నారు.

