Ujjain Wonder: మధ్యప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం ఉజ్జయినిలో జరిగిన ఓ విచిత్ర సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అత్యాధునిక యంత్రాలు, భారీ క్రేన్లు ఉపయోగించినా 170 ఏళ్ల పురాతన రాతి హనుమాన్ విగ్రహం అంగుళం కూడా కదలకపోవడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. దీన్ని ప్రత్యక్ష దైవలీలగా భక్తులు భావిస్తుండగా, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉజ్జయినిలో రానున్న సింహస్థ మహాకుంభం కోసం అధికారులు భారీ ఎత్తున అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణ చేపడుతున్నారు. ఇందులో భాగంగా కాంతల్ నుండి ఛత్రి చౌక్ వరకు ఉన్న ప్రధాన రహదారిని వెడల్పు చేసేందుకు, మార్గమధ్యంలో ఉన్న 170 ఏళ్ల నాటి చారిత్రక హనుమాన్ ఆలయాన్ని వేరొక చోటికి తరలించాలని నిర్ణయించారు. ముందుగా ఆలయ బాహ్య నిర్మాణాన్ని తొలగించిన అధికారులు, అనంతరం మూలవిరాట్‌ను తరలించే ప్రక్రియ మొదలుపెట్టారు.

రెండు రోజుల పాటు శ్రమించినా కదలని విగ్రహం

విగ్రహాన్ని ఏమాత్రం దెబ్బతినకుండా సురక్షితంగా మరోచోటికి తరలించేందుకు ఇండోర్ నుంచి ప్రత్యేక ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల బృందాన్ని రప్పించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ క్రేన్లను రంగంలోకి దించారు. రెండు రోజుల పాటు నిర్విరామంగా శ్రమించినప్పటికీ, రాతి హనుమాన్ విగ్రహాన్ని కనీసం ఒక అంగుళం కూడా కదల్చలేకపోయారు. ఇంజనీర్లు సైతం విస్మయం వ్యక్తం చేస్తూ చివరకు ప్రయత్నాలను విరమించుకున్నారు.

భక్తుల నిరసన.. రంగంలోకి హిందూ సంస్థలు

యంత్రాలకే లొంగని ఈ విగ్రహాన్ని చూసి స్థానికులు, భక్తులు ఇది ముమ్మాటికీ దైవ సంకల్పమేనని స్పష్టం చేస్తున్నారు. విగ్రహం అక్కడి నుంచి కదలకూడదనేది ఆంజనేయుడి ఆజ్ఞ అని చెబుతూ పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే విగ్రహంపై తాత్కాలికంగా టెంట్ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు, మహా హారతి నిర్వహించారు. బాలవిజయ్ మాస్ట్ హనుమాన్ ఆలయ పూజారి సులభ్ శాంతను శర్మ మాట్లాడుతూ.. "విగ్రహానికి ఇరువైపులా రాకపోకలకు తగినంత స్థలం ఉంది. రోడ్డు డిజైన్‌ను మార్చి విగ్రహాన్ని అక్కడే ఉంచేలా ప్రభుత్వం పునఃపరిశీలించాలి. విగ్రహానికి ఎలాంటి హాని జరగకుండా చూస్తామని రాతపూర్వక హామీ ఇవ్వకపోతే తరలింపును అడ్డుకుంటాం" అని హెచ్చరించారు.

తరలింపు నిలిపివేత.. పురావస్తు శాఖ స్కానింగ్

భక్తుల ఆందోళన, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తహసీల్దార్ షెఫాలీ జైన్ స్పందించారు. ప్రస్తుతానికి విగ్రహ తరలింపు ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. విగ్రహం భూమిలో ఎంత లోతు వరకు విస్తరించి ఉంది? దాని పునాది నిర్మాణం, భూగర్భ నేల స్వభావం ఎలా ఉన్నాయనే అంశాలను తేల్చేందుకు పురావస్తు శాఖ రంగంలోకి దిగింది. అత్యాధునిక స్కానింగ్ యంత్రాలతో పరిశీలించి వారు ఇచ్చే నివేదిక ఆధారంగానే తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. అప్పటివరకు విగ్రహం ఉన్న ప్రాంతంలో యథావిధిగా పూజలు కొనసాగనున్నాయి.

Next Story