Vaikuntha Dwara Darshan for 10 Days at Srivari Temple: శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం
10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

Vaikuntha Dwara Darshan for 10 Days at Srivari Temple: భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు చెప్పారు. అదేవిధంగా ధర్మ ప్రచారంలో భాగంగా గ్రామాల్లో భజన మందిరాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.
1.ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. బ్రహ్మోత్సవాల విజయవంతంలో భాగస్వాములైన ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, ఇతర విభాగాల సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, సహకరించిన మీడియాకు, భక్తులకు టీటీడీ బోర్డు అభినందనలు తెలియజేస్తోంది.
2.తిరుమలలో గదుల టారీఫ్ లను పరిశీలించి నివేదిక సమర్పించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.
3. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో టిటిడి ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం. పర్మినెంట్ ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్ / జౌట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535 ఇవ్వాలని నిర్ణయం. అయితే బ్రహ్మోత్సవాలలో పనిచేసిన తిరుమల, తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా 10 శాతం ఇవ్వాలని నిర్ణయం.
4. టీటీడీ గోశాల నిర్వహణకు సబంధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా గోశాల నిర్వహణ, అభివృద్ధిపై తదుపరి చర్యలు తీసుకుంటాం.
5. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ.37 కోట్ల వ్యయంతో 100 గదులను ఆధునిక వసతులతో నూతన అతిధి భవనాన్ని నిర్మించేందుకు ఆమోదం.
6. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద భక్తులకు మరింత ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు రూ.2.96 కోట్లతో 1.35 ఎకరాల్లో పవిత్ర వనం ఏర్పాటుకు ఆమోదం.
7. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద యాత్రికుల వసతి సముదాయం, సామూహిక వివాహాలకు ప్రత్యేక హాల్స్ నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరుకు ఆమోదం. ఇందుకు సంబంధించి ప్రభుత్వ అనుమతి కొరకు పంపాపలని నిర్ణయం.
8. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చెన్నై టి.నగర్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం పరిధిలో ఉన్న 6,227 చ.అ. స్థలాన్ని దాతల సహకారంతో రూ.14 కోట్లతో కొనుగోలు చేసేందుకు నిర్ణయం .
9. తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ లో శ్రీ పద్మావతి మరియు శ్రీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, ఆలయ ప్రాకారం, రాజగోపురం, నాలుగు మాడ వీధులు, తదితర మౌళిక సదుపాయాల కల్పనకు ఇప్పటికే ఆమోదించిన రూ.20 కోట్ల నిధులతో పాటు అదనంగా మరో రూ. 10 కోట్లు దాతల ద్వారా సేకరించాలని నిర్ణయం.
10. వేద విశ్వవిద్యాలయం విసి ఆచార్య రాణి సదా శివమూర్తిని తొలగించాలని నిర్ణయం.
11. టీటీడీ కొనుగోలు విభాగంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణకు ఎసిబితో విచారణ జరపాలని నిర్ణయం.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

