డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి.. టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు
టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు

డిసెంబరు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి అనుబంధ ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించనున్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున 1.35 గంటలకు ఉత్తర ద్వారా దర్శనం కల్పించనున్నారు. ఉదయం 8.30 గంటలకు స్వామివారు గరుడవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి.
నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామివారి ఆలయంలో… నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామివారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 1.35 గంటలకు ఉత్తర ద్వారా దర్శనం, ఉదయం 8.30 గంటలకు లక్ష తులసీ అర్చన నిర్వహించనున్నారు.
డిసెంబరు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 9 గంటలకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 1.35 గంటలకు ఉత్తర ద్వారా దర్శనం కల్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
డిసెంబరు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు చక్రస్నాం నిర్వహించనున్నారు. జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 1.35 గంటలకు భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పించనున్నారు.
అదేవిధంగా అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం, రాజంపేటలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, పిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం, బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతిలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

