Sri Padmavathi Ammavari Temple: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం శుక్రవారం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించిన ఈ పవిత్ర వేడుకలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సిహెచ్. వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.

విశేష పూజలతో వరలక్ష్మీ వ్రతం

వేకువజామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు చీరతో విశేషంగా అలంకరించుకుని భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.

అనంతరం ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

రోజా, మల్లె, చామంతి, సంపంగి, తామర, తులసి తదితర సుగంధ, సంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో అర్చించారు. తొమ్మిది గ్రంథులతో అమ్మవారిని అలంకరించి, ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు ప్రతీకగా పూజించారు. అనంతరం 12 రకాల నైవేద్యాలను సమర్పించి మహా మంగళహారతితో వ్రతాన్ని ముగించారు.

మహిళలకు మంగళప్రదమైన వరలక్ష్మీ వ్రతం

వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ద్వారా సత్సంతానం, దీర్ఘమాంగల్య సౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు.

సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించినందున, అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం అత్యంత విశిష్టమైనదని పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story