Vasant Panchami festival: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా విశేషపూజ
శాస్త్రోక్తంగా విశేషపూజ

Vasant Panchami festival: వసంత పంచమి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో శుక్రవారం వార్షిక విశేష పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చతుర్దశ కలశావాహనం గావించి పుణ్యహవచనం, వివిధ క్రతువులను నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగిసింది. గతంలో శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేషపూజను నిర్వహించేవారు. శ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలనే జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితుల సూచన మేరకు వసంతోత్సవం, సహస్ర కలశాభిశేకం, విషేశపూజను ఏడాదికోసారి నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత ఏడాది నుండి వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో వార్షిక విశేషపూజను సర్కార్ (ఏకాంతం)గా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

