Vastu Alert: వాస్తు జాగ్రత్త: ఇంట్లో సింహం చిత్రం ఉంచుతున్నారా? ఈ నష్టాలు తెలిస్తే అస్సలు పెట్టరు..
ఈ నష్టాలు తెలిస్తే అస్సలు పెట్టరు..

Vastu Alert: చాలా మంది తమ ఇళ్లను అందంగా అలంకరించుకోవడానికి రకరకాల పెయింటింగ్స్, జంతువుల చిత్రాలను గోడలపై పెడుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం.. ప్రతి చిత్రానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అది సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా మృగరాజు సింహం చిత్రం ఇంట్లో ఉండటం శుభమా? అశుభమా? అనే దానిపై వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
సింహం చిత్రం - ఎందుకు అశుభం?
సింహం అడవికి రాజు కావచ్చు, శక్తికి చిహ్నం కావచ్చు. కానీ నివాస గృహాల్లో సింహం చిత్రాన్ని ఉంచడం అశుభకరమని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది. దీనివల్ల కలిగే ప్రధాన నష్టాలు ఇవే..
కుటుంబంలో కలహాలు: సింహం ఒక క్రూరమైన, హింసాత్మక జంతువు. అటువంటి చిత్రాలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లోని వారి ప్రవర్తనలో దూకుడు పెరుగుతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు, అపార్థాలకు దారితీస్తుంది.
ఆర్థిక సంక్షోభం: ఇంట్లో సింహం వంటి క్రూర మృగాల చిత్రాలు ఉండటం వల్ల ప్రతికూల శక్తి పెరిగి, పేదరికం వచ్చే అవకాశం ఉందని, ఆర్థికంగా నష్టపోతారని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మానసిక ఒత్తిడి: దూకుడుగా ఉన్న చిత్రాలు నిరంతరం కళ్ల ముందు ఉండటం వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది, ఒత్తిడి పెరుగుతుంది.
శ్రేయస్సును ఇచ్చే చిత్రాలు ఇవే..
ఇంట్లో సింహానికి బదులుగా సాత్వికమైన, సానుకూల శక్తిని ఇచ్చే ఈ చిత్రాలను ఉంచుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వాస్తు శాస్త్రం సూచిస్తోంది..
ఏడు గుర్రాలు: పరిగెత్తే ఏడు తెల్ల గుర్రాల చిత్రం పురోగతికి, విజయానికి చిహ్నం.
కామధేనువు: ఇంట్లో కామధేనువు చిత్రం లేదా విగ్రహం ఉండటం వల్ల సర్వ సుఖాలు లభిస్తాయి.
ఏనుగులు - తాబేళ్లు: ఇవి దీర్ఘాయువును, సంపదను, స్థిరత్వాన్ని ఇస్తాయి.
నెమలి - ఫ్లెమింగోలు: ఇవి కుటుంబంలో ప్రేమను, జ్ఞానాన్ని, శాంతిని పెంపొందిస్తాయి.
మీ ఇంట్లో అశాంతి రాజ్యమేలుతున్నా లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ముందుగా మీ గోడలపై ఉన్న చిత్రాలను గమనించండి. క్రూర జంతువులు, యుద్ధ సన్నివేశాలు లేదా ఏడుస్తున్నట్లు ఉండే చిత్రాలను వెంటనే తొలగించి, ప్రశాంతతను ఇచ్చే చిత్రాలను ఏర్పాటు చేసుకోండి.

