‘Venkatadri’ App: భక్తుల కోసం ‘వేంకటాద్రి’ యాప్.. టీటీడీ కొత్త సేవలు
టీటీడీ కొత్త సేవలు

‘Venkatadri’ App: తిరుమలకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కొత్తగా ‘వేంకటాద్రి’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ యాప్‌ను ప్రారంభించినట్లు టీటీడీ ఐటీ జీఎం వేంకటేశ్వర్లు నాయుడు తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2 మీడియా సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందించడంతో పాటు, వివిధ సేవలను సులభంగా పొందేందుకు టీటీడీ ఐటీ సేవలను మరింత మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. దర్శన క్యూలైన్లను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. త్వరలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించే ఏఎన్‌పీఆర్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరిచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు వివరించారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజున గ్యాలరీ పాసుల జారీకి క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని వేంకటేశ్వర్లు నాయుడు కోరారు. అందుబాటులో ఉన్న టికెట్ల కంటే పది రెట్లు ఎక్కువగా డిమాండ్ ఉండటంతో చాలా మందికి టికెట్లు దొరకడం లేదని, దీన్ని కొందరు వెబ్‌సైట్ సమస్యగా భావిస్తున్నారని వివరించారు. టీటీడీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడం సాధ్యం కాదని ఆయన తెలిపారు. థర్డ్ పార్టీ యాప్‌లు, ఆటో ఫిల్లింగ్, కాపీ-పేస్ట్ టూల్స్ ద్వారా టికెట్లు బుక్ చేసేందుకు ప్రయత్నించే వారిని గుర్తించి బ్లాక్ చేస్తున్నట్లు చెప్పారు. దర్శన టికెట్ల బుకింగ్‌పై సందేహాలు ఉంటే టీటీడీ అధికారిక హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. దర్శనం, వసతి తదితర సేవల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌నే ఉపయోగించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీటీడీ సీపీఆర్వో డాక్టర్ టి. రవి, శ్వేత డైరెక్టర్ డాక్టర్ వేమా వేంకటరత్నం పాల్గొన్నారు.

