వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

Venkateswara Swamy Brahmotsavams: కడప జిల్లా, దేవుని కడపలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉద‌యం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు‌, గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారు. సకలదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 10.00 గం.ల నుండి 10.30 గం.ల మధ్య తిరుచ్చి ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కాగా, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి వారు విహరించనున్నారు.

ఆలయ నేపథ్యం – దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైనది. కృష్ణాచార్యులు ఇచ్చట శ్రీ వేంకటేశ్వరుని ప్రతిష్టించినట్లు ప్రతీతి. తిరుమల వరాహ క్షేత్రమైతే దేవుని కడప హనుమత్ క్షేత్రం. ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వెనుక భాగమున ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ప్రత్యక్షంగా సేవించి, స్వామివారిని కడప రాయుడని, వేంకటాద్రి కడప రాయుడని పేర్కొన్నారు. పూర్వం తిరుపతికి వెళ్లే యాత్రికులకు మార్గమిదే. దేవుని కడపలో వెలసియున్న శ్రీ స్వామివారి దర్శనాంతరమే తిరుమలేశుని దర్శించడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ ఆలయంలో రాజగోపురం, తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ గోపురం ఒకే కాలంలో నిర్మించినట్లు శాసనం ద్వారా తెలుస్తోంది. స్వామివారి రథోత్సవం, రథసప్తమి రోజున కన్నుల పండవగా నిర్వహిస్తారు. రథసప్తమిరోజున భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శిస్తారు.

కాగా, జనవరి 24వ తేదీ ఉదయం 10.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. జనవరి 28న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది.వాహన సేవలలో భాగంగా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారు ఉదయం 09.00 గం.ల నుండి 10.00 గం.ల వరకు రాత్రి 08.00 గం.ల నుండి 09.00 గం.ల వరకు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజు వాహనసేవల ముందు కోలాటాలు, హరికథ, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ అర్చకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story