Remove Navagraha Doshas: హిందూ సాంప్రదాయంలో నవగ్రహ పూజకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. మానవ జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత విజయం.. ఇవన్నీ నవగ్రహాల గమనంతో ముడిపడి ఉంటాయని నమ్ముతారు. గ్రహ దోషాల వల్ల జీవితంలో అడ్డంకులు ఎదురవుతున్నప్పుడు, గుడికి వెళ్లి నవగ్రహాలను పూజించడం, ప్రదక్షిణలు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అయితే నవగ్రహ ప్రదక్షిణలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను ఖచ్చితంగా పాటించాలి. సరైన పద్ధతిలో ప్రదక్షిణలు చేసినప్పుడే సంపూర్ణ గ్రహ అనుగ్రహం లభిస్తుంది.

నవగ్రహ ప్రదక్షిణలు చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్య నియమాలు..

తొలుత శివ దర్శనం:

దేవాలయానికి వెళ్లినప్పుడు నేరుగా నవగ్రహాల వద్దకు వెళ్లకూడదు. ముందుగా ప్రధాన దైవాన్ని (శివుడు లేదా విష్ణువు) దర్శించుకున్న తర్వాతే నవగ్రహాల వద్దకు వెళ్లాలి.

ఎన్ని ప్రదక్షిణలు చేయాలి?

సాధారణంగా నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయడం చాలా శ్రేష్ఠం. కొన్ని ప్రత్యేక దోష నివారణల కోసం లేదా వ్యక్తిగత జాతక దోషాలను బట్టి నిర్ణీత సంఖ్యలో ప్రదక్షిణలు చేయమని పూజారులు సూచిస్తారు.

ప్రదక్షిణ చేసే దిశ (సవ్య / అపసవ్య):

నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎల్లప్పుడూ సవ్య దిశలోనే తిరగాలి.

రాహు, కేతు గ్రహాలు అపసవ్య దిశలో సంచరిస్తాయి కాబట్టి కొన్ని ప్రత్యేక పూజల సమయంలో మాత్రమే పండితుల సలహాతో అపసవ్య దిశలో ప్రదక్షిణ చేస్తారు. సాధారణ రోజుల్లో మాత్రం సవ్య దిశలోనే ప్రదక్షిణలు చేయడం శ్రేయస్కరం.

గ్రహాలను తాకకూడదు:

ప్రదక్షిణలు చేసే సమయంలో లేదా పూజ సమయంలో నవగ్రహ విగ్రహాలను నేరుగా తాకకూడదు. కేవలం నమస్కరిస్తూ ప్రార్థించాలి.

నవగ్రహాల మధ్యలో నడవకూడదు:

నవగ్రహ మండపంలో విగ్రహాల మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశంలో నడవకూడదు. విగ్రహాల బయటి వైపునుంచే ప్రదక్షిణ పూర్తి చేయాలి.

ప్రదక్షిణ చేసేటప్పుడు మంత్రోచ్ఛారణ:

ప్రదక్షిణలు చేసేటప్పుడు ప్రతి గ్రహానికి సంబంధించిన నామాన్ని లేదా కింద తెలిపిన సాధారణ నవగ్రహ మంత్రాన్ని మనసులో జపించడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది..

"నమః సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

పరిహారాలు - జాగ్రత్తలు..

స్వచ్ఛమైన మనస్సు:

కోపం, ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన మనస్సుతో ప్రదక్షిణలు చేయాలి.

దీపారాధన:

నవగ్రహాల అనుగ్రహం కోసం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం మంచిది.

దానాలు:

జాతకంలో ఏ గ్రహం బలహీనంగా ఉందో, ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యాలు (ఉదాహరణకు శని దోషానికి నల్ల నువ్వులు, గురు దోషానికి శనగలు) దానం చేయడం వల్ల దోష తీవ్రత తగ్గుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story