Vishnu Sahasranama: విష్ణు సహస్ర నామాలు అంటే ఏంటి?..పఠిస్తే ఏమవుతుంది.?
పఠిస్తే ఏమవుతుంది.?

Vishnu Sahasranama: విష్ణు సహస్ర నామాలు ముఖ్యంగా మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో కనిపిస్తాయి. దీని వెనుక ఉన్న నేపథ్యం ఏంటంటే.? కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన తర్వాత, ధర్మరాజు (యుధిష్ఠిరుడు) యుద్ధంలో జరిగిన జననష్టం, బంధువుల మరణాల వల్ల తీవ్రమైన దుఃఖంలో, అపరాధ భావనలో ఉంటాడు. ఆయన మనస్సు ప్రశాంతంగా ఉండదు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజును భీష్మాచార్యుల వద్దకు వెళ్ళమని సలహా ఇస్తాడు. ఎందుకంటే, భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పటికీ, అపారమైన ధర్మజ్ఞానం, జ్ఞాన సంపద ఆయనలో నిండి ఉన్నాయి. భీష్ముడి ఉపదేశం ధర్మరాజు మనస్సుకు శాంతిని కలిగిస్తుందని కృష్ణుడు చెబుతాడు.
ధర్మరాజు తన సోదరులు, శ్రీకృష్ణుడితో కలిసి భీష్ముడి వద్దకు వెళ్తాడు. అప్పుడు ధర్మరాజు, భీష్ముడిని పరమ ధర్మం గురించి, సమస్త బాధలను తొలగించి, మోక్షాన్ని ప్రసాదించే అత్యుత్తమ స్తోత్రం గురించి ప్రశ్నిస్తాడు.
ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, భీష్మాచార్యుడు శ్రీ మహావిష్ణువు గొప్పదనాన్ని, ఆయన వెయ్యి (సహస్ర) నామాలను కీర్తిస్తూ ఉపదేశిస్తాడు. ఈ వేయి నామాలు విష్ణుమూర్తి యొక్క గుణాలను, లీలలను, దివ్య స్వరూపాలను తెలియజేస్తాయి. ఈ నామాలను నిత్యం పఠించడం లేదా వినడం వలన సకల పాపాలు తొలగి, మనస్సుకు శాంతి, ముక్తి లభిస్తుందని భీష్ముడు చెబుతాడు.
భీష్ముడు ఉపదేశించిన ఈ వేయి నామాలను ఆ సమయంలో అక్కడ ఉన్న వేద వ్యాస మహర్షి లిఖితపూర్వకంగా నమోదు చేసి, వాటిని మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో పొందుపరిచారు.

