Lamp Goes Out During Worship: పూజ చేసేటప్పుడు దీపం ఆరిపోతే ఏం జరుగుతుంది?
దీపం ఆరిపోతే ఏం జరుగుతుంది?

Lamp Goes Out During Worship: హిందూ సంప్రదాయంలో నిత్య దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపం కేవలం కాంతిని మాత్రమే కాదు.. మనలోని జ్ఞానాన్ని, సానుకూలతను ప్రతిబింబిస్తుంది. అందుకే దీపారాధన లేని పూజ సంపూర్ణం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, నిత్యం దీపారాధన చేసే సమయంలో చాలామందికి కొన్ని సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా.. పూజ చేసేటప్పుడు దీపం ఆరిపోతే ఏం జరుగుతుంది? అది అశుభమా? పండితులు ఏమంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.
దీపం వెలిగించడం వల్ల మనసుకి ప్రశాంతత, ఆర్థిక అభివృద్ధి లభిస్తాయి. కానీ, పూజ మధ్యలో దీపం ఆరిపోతే దానిని 'కొండెక్కడం' అంటారు. ఇలా జరిగినప్పుడు చాలామంది భయాందోళనకు గురవుతారు. ఏదైనా కీడు జరుగుతుందేమో అని అపశకునంగా భావిస్తారు. ఆధ్యాత్మిక పండితుల అభిప్రాయం ప్రకారం.. దీపం మసకగా వెలగడం లేదా ఆరిపోవడం అనేది ఆ ప్రదేశంలో ప్రతికూల శక్తికి లేదా వాస్తు దోషానికి సంకేతం కావచ్చు. అలాగే పూజ సమయంలో మన ఏకాగ్రత లోపించినప్పుడు కూడా ఇలా జరిగే అవకాశం ఉంది.
దీపారాధన విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే పూర్వీకులకు కోపం వస్తుందని కొందరు విశ్వసిస్తారు. అయితే, దీపం ఆరిపోయినంత మాత్రాన కంగారు పడాల్సిన పనిలేదు. ఒకవేళ పూజ మధ్యలో అనుకోకుండా దీపం కొండెక్కితే.. వెంటనే మనసులో భగవంతుడిని స్మరించుకోండి. తెలియక చేసిన పొరపాట్లకు దేవుడిని క్షమాపణ కోరండి. ఆ తర్వాత ప్రశాంత చిత్తంతో మళ్ళీ దీపాన్ని వెలిగించండి. మీ కులదైవాన్ని లేదా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ.. "ఓం నమః శివాయ" అనే మంత్రాన్ని జపించండి.
ఒకవేళ దీపం ఆరిపోవడం వల్ల మీ మనసులో ఏవైనా ప్రతికూల ఆలోచనలు వస్తుంటే.. వెంటనే కర్పూరం వెలిగించండి. కర్పూర కాంతి, దాని సువాసన ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి, మళ్లీ సానుకూల వాతావరణాన్ని నింపుతాయి. భక్తితో చేసే పూజలో మనసు స్వచ్ఛంగా ఉంటే.. ఆ దైవాశీస్సులు మీకు తప్పక లభిస్తాయి.

