Manasa Snanam: మానస స్నానం అంటే ఏంటి..ఎలా చేస్తారు.?
ఎలా చేస్తారు.?

Manasa Snanam: మానస స్నానం అంటే నీటితో చేసే కాకుండా కేవలం మనస్సుతో చేసే అంతర్గత శుద్ధి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, బాహ్య స్నానం శరీరాన్ని శుభ్రపరిస్తే, మానస స్నానం ఆత్మను, మనస్సును పవిత్రం చేస్తుంది.
మానస స్నానంలో ఎటువంటి నీటి అవసరం ఉండదు. ఇది పూర్తిగా ధ్యానం (Meditation) మీద ఆధారపడి ఉంటుంది.కళ్లు మూసుకుని, సర్వవ్యాపి అయిన శ్రీ మహావిష్ణువును లేదా మీ ఇష్ట దైవాన్ని మనస్సులో స్మరించుకోవాలి.భగవంతుని నామస్మరణ చేస్తూ, ఆ దైవ స్మరణ అనే పవిత్ర గంగాజలంలో మీ మనస్సు మునిగి తేలుతున్నట్లు భావించాలి.విష్ణువు పాదాల నుంచి ఉద్భవించిన గంగ తనపై ప్రవహిస్తూ, తనలోని అజ్ఞానాన్ని, పాపాలను కడిగివేస్తున్నట్లు ఊహించుకోవాలి.
దీని ప్రాముఖ్యత ఏంటి?
శాస్త్రాల ప్రకారం స్నానాలు పలు రకాలు (బ్రాహ్మ, ఆగ్నేయ, వారుణ, వాయవ్య, మానస). వీటిలో మానస స్నానమే అత్యుత్తమమైనదిగా పరిగణించబడుతుంది.
చిత్త శుద్ధి: శరీరాన్ని ఎన్నిసార్లు కడిగినా మనసులోని రాగద్వేషాలు పోవు. కానీ భగవత్ ధ్యానం వల్ల మనసు నిర్మలమవుతుంది.
ఎక్కడైనా చేయవచ్చు: అనారోగ్యం వల్ల లేదా ప్రయాణాల్లో నీటితో స్నానం చేసే వీలు లేనప్పుడు, ఈ మానస స్నానం చేయడం వల్ల స్నాన ఫలం లభిస్తుంది.
బాహ్య స్నానం కేవలం చర్మాన్ని శుభ్రం చేస్తుంది, కానీ మానస స్నానం ఆత్మకు ఆరోగ్యాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. అందుకే ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత కనీసం ఒక నిమిషం పాటు దైవ ధ్యానం చేయడం వల్ల పూర్తి ఫలితం లభిస్తుంది.

