Srivari Paada Theertham: శ్రీవారి పాద తీర్థం అంటే ఏంటి.. విశిష్టత ఏంటి.?
విశిష్టత ఏంటి.?

Srivari Paada Theertham: తిరుమల యాత్రలో 'శ్రీవారి పాద తీర్థం' స్వీకరించడం అనేది భక్తులకు అత్యంత పరమ పవిత్రమైన ఘట్టం. గంటల తరబడి వేచి చూసి, ఆ వేంకటేశ్వరుడి దివ్య మంగళ రూపాన్ని కళ్ళారా చూసుకున్న తర్వాత.. ఆ తన్మయత్వంలో ఉండగానే ఇచ్చే ఈ తీర్థం మనసుని, శరీరాన్ని పునీతం చేస్తుందని నమ్ముతారు.సాధారణంగా శ్రీవారి దర్శనం ముగించుకుని గర్భాలయం నుండి బయటకు రాగానే, కుడివైపున విమాన ప్రదక్షిణ మార్గంలో భక్తులకు తీర్థం ప్రసాదిస్తారు. దీన్ని మనం 'శ్రీవారి పాద తీర్థం' అని పిలుస్తాం.
పాద తీర్థం విశిష్టత
అభిషేక జలం: ప్రతిరోజూ స్వామివారికి జరిగే అభిషేకంలో ఉపయోగించిన పాలు, గంధం, పసుపు, కుంకుమపువ్వు, యాలకుల సుగంధం కలిసిన జలమే ఈ తీర్థం.
ఔషధ గుణాలు: ఇందులో పచ్చకర్పూరం, తులసి దళాలు కలవడం వల్ల ఇది కేవలం ఆధ్యాత్మికమే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఎంతో విశిష్టమైనది.
ముక్తి ప్రదాత: "అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం శ్రీవార పాదోదకం శుభం" అని భక్తులు స్మరిస్తూ ఈ తీర్థాన్ని స్వీకరిస్తారు. అంటే, అకాల మృత్యువుని తొలగించి, సర్వ వ్యాధులను నయం చేసే శక్తి దీనికి ఉందని అర్థం.
తీర్థం తీసుకునే విధానం
ముద్ర: కుడి అరచేతిని 'గోకర్ణ ఆకృతి'లో (ఆవు చెవి ఆకారంలా) మలిచి, ఎడమ చేతిని కుడి చేతి కింద ఆసరాగా ఉంచి తీర్థాన్ని స్వీకరించాలి.
శబ్దం రాకూడదు: తీర్థాన్ని తాగేటప్పుడు ఎటువంటి జుర్రుమనే శబ్దం రాకుండా నిశ్శబ్దంగా తాగడం పద్ధతి.
తలకు రాసుకోవచ్చా?: శాస్త్రం ప్రకారం తీర్థం స్వీకరించిన తర్వాత తడి చేతిని తలకు రాసుకోకూడదు. ఎందుకంటే అది భగవంతుడి నిర్మాల్యం (ఉచ్ఛిష్టం కాదు, పవిత్రమైనది). చేతికి ఉన్న తడిని కళ్ళకు అద్దుకోవచ్చు లేదా అలాగే ఆరనివ్వాలి.

