Krittika Nakshatra and Lord Subrahmanya: ఆకాశంలో కాంతివంతంగా మెరిసే నక్షత్రాల సమూహంలో 'కృత్తిక' అత్యంత ప్రాధాన్యత కలిగిన నక్షత్రం. మన జ్యోతిష్య శాస్త్రంలో ఉండే 27 నక్షత్రాలలో ఇది మూడవది. ఈ నక్షత్రానికి అధిపతి అగ్నిదేవుడు. కృత్తిక నక్షత్రం తీవ్రమైన అగ్ని తత్వాన్ని, తేజస్సును, శక్తిని సూచిస్తుంది. అయితే ఈ నక్షత్రానికి, పరమశివుని కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత అవినాభావ సంబంధం ఉంది.

పురాణాల ప్రకారం లోకాలను పీడిస్తున్న తారకాసురుడనే రాక్షసుడిని అంతం చేయడానికి పరమశివుడి తేజస్సు నుంచి సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. శివుని దివ్య తేజస్సు ఆరు భాగాలుగా విడిపోయి, శరవణ పొయి అనే సరస్సులో ఆరు పద్మాలపై ఆరుమంది పిల్లలుగా రూపం దాల్చింది. ఆ సమయంలో దేవలోకానికి చెందిన ఆరుగురు దివ్య స్త్రీలు, అంటే కృత్తికలనే దేవతలు ఆ ఆరుగురు బాలురకు పాలు పట్టి, ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశారు. ఆ కృత్తిక మాతల సంరక్షణలో స్వామివారు పెరగడం వల్ల ఆయనకు 'కార్తికేయుడు' అనే పేరు వచ్చింది.

కృత్తిక దేవతల పెంపకానికి, వారి భక్తికి సంతోషించిన పరమశివుడు ఒక దివ్య వరాన్ని ప్రసాదించారు. కృత్తికా నక్షత్రం రోజున ఎవరు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో, వారికి కార్తికేయునితో పాటు ఆ ఆరుగురు కృత్తికా దేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయని చెప్పారు. అందుకే ప్రతి నెలలో వచ్చే కృత్తిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. విశేషంగా తమిళ క్యాలెండర్ ప్రకారం కార్తిక మాసంలో వచ్చే 'కార్తికై దీపం' పండుగ రోజున కృత్తిక నక్షత్రంలో స్వామివారికి పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి పూజిస్తారు.

ఈ విధంగా కృత్తిక నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి, ఆయన చూపించే మాతృప్రేమకు, విజయానికి సంకేతంగా నిలుస్తుంది. ఈ రోజున స్వామివారిని స్మరిస్తే ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి, మానసిక ధైర్యం, ఆరోగ్యం మరియు సర్వకార్య జయం లభిస్తాయని భక్తులు గట్టిగా నమ్ముతారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story