Secret Behind Panchamukha Hanuman: పంచముఖ హనుమంతుడి అవతారం వెనుక రహస్యమేంటి? ఆంజనేయుడు ఈ రూపాన్ని ఎందుకు ఎత్తాడు?
ఆంజనేయుడు ఈ రూపాన్ని ఎందుకు ఎత్తాడు?

Secret Behind Panchamukha Hanuman: హనుమంతుడికి ఉండే అత్యంత శక్తివంతమైన, మహిమాన్వితమైన రూపాల్లో పంచముఖ హనుమద్రూపం ఒకటి. మన ఇళ్లలో, దేవాలయాలలో ఐదు ముఖాలు కలిగిన ఆంజనేయుడి ఫోటోలు, విగ్రహాలను చూస్తూనే ఉంటాం. అయితే హనుమంతుడు ఈ విచిత్రమైన, అత్యంత భయంకరమైన రూపాన్ని ధరించడానికి వెనుక ఉన్న ఆధ్యాత్మిక కథనం ఏమిటో చాలా మందికి తెలియదు.
త్రేతాయుగంలో రామ రావణ యుద్దం తీవ్ర స్థాయికి చేరుకున్న సమయంలో రాముడు, లక్ష్మణుల ప్రాణాలను కాపాడేందుకు ఆంజనేయుడు ఈ అవతారాన్ని ఎత్తాల్సి వచ్చింది.
రామ-రావణ యుద్ధం - పాతాళ లంక ఘట్టం:
యుద్ధంలో రాముడి చేతిలో మేఘనాథుడు, కుంభకర్ణుడు వంటి వీరులు నేలకూలిన తర్వాత రావణాసురుడు దిక్కుతోచక తన సోదరుడు, పాతాళ లోకానికి రాజైన అహిరావణుడి సహాయం కోరాడు. అహిరావణుడు గొప్ప మాయావి, కాళికాదేవి భక్తుడు.
రావణుడి ఆదేశంతో అహిరావణుడు మాయా రూపంలో రామ లక్ష్మణులు నిద్రిస్తున్న శిబిరంలోకి ప్రవేశించాడు. హనుమంతుడు తన తోకతో నిర్మించిన రక్షణ వలయాన్ని కూడా దాటుకుని, రామ-లక్ష్మణులకు మత్తు మందు చల్లి వారిని పాతాళ లోకానికి అపహరించుకుపోయాడు. అక్కడ కాళికాదేవికి వారిని బలి ఇవ్వడానికి సిద్ధం చేశాడు.
పాతాళంలో హనుమంతుని శోధన..
రామ-లక్ష్మణులు కనిపించకపోవడంతో విభీషణుడి సూచన మేరకు హనుమంతుడు పాతాళ లోకానికి వెళ్లాడు. అక్కడ అహిరావణుడితో ఘోరమైన యుద్ధం చేశాడు. అయితే అహిరావణుడిని అంతం చేయడం సాధారణ విషయంగా మారలేదు. దానికి ఒక ప్రత్యేకమైన రహస్యం ఉండింది.
ఐదు ముఖాల రహస్యం - పంచ దీపాలు:
అహిరావణుడి ప్రాణాలు పాతాళంలో వేర్వేరు ఐదు దిక్కుల్లో వెలుగుతున్న ఐదు దీపాలలో దాగి ఉన్నాయి. ఆ ఐదు దీపాలను ఒక్కసారిగా, ఒకే సమయంలో ఆర్పివేస్తేనే అహిరావణుడు మరణిస్తాడనేది ఆ రహస్యం. ఈ కార్యం నెరవేర్చడానికి ఆంజనేయుడు ఐదు ముఖాల విరాట్ రూపాన్ని ధరించాడు.
పంచ ముఖాల ప్రాశస్త్యం:
హనుమ ముఖం: ఇష్టకామ్య సిద్ధిని, శత్రు భయాన్ని తొలగిస్తుంది.
నరసింహ ముఖం: భయాన్ని పోగొట్టి, విజయాన్ని అందిస్తుంది.
గరుడ ముఖం: విష ప్రభావాలు, దుష్ట గ్రహ దోషాల నుండి రక్షణ ఇస్తుంది.
వరాహ ముఖం: ధన లాభం, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
హయగ్రీవ ముఖం: జ్ఞానం, విద్య, బుద్ధిని ప్రసాదిస్తుంది.
ఈ ఐదు ముఖాలతో హనుమంతుడు ఒక్కసారిగా ఐదు దిక్కుల ఉన్న దీపాలను ఊది ఆర్పివేశాడు. వెంటనే అహిరావణుడి శక్తి క్షీణించిపోగా, హనుమంతుడు అతడిని సంహరించి రామ, లక్ష్మణులను సురక్షితంగా పాతాళ లోకం నుండి తీసుకువచ్చాడు.
పంచముఖ హనుమాన్ పూజా ఫలితం..
ఇంట్లో పంచముఖ హనుమంతుడి పటం ఉంచి నిత్యం పూజించడం లేదా హనుమాన్ చాలీసా, పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వల్ల..
వాస్తు దోషాలు, చేతబడులు, దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతాయి.
మానసిక భయం, ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

