పులిపాల యాత్ర కథ ఏంటి?

Ayyappa Pulipala Yatra: పూర్వం, కేరళలోని పందళం రాజ్యాన్ని రాజశేఖరుడు అనే రాజు పాలించేవాడు. ఆయనకు పుత్ర సంతానం కోసం ఎప్పుడూ బాధపడుతుండేవాడు. ఒకసారి, వేట కోసం వెళ్లినప్పుడు పంబా నదీ తీరంలో మెడలో మణిహారం ఉన్న ఒక దివ్యమైన శిశువును చూసి ఆశ్చర్యపోయాడు. ఈ శిశువే శివకేశవుల తేజస్సుతో జన్మించిన మణికంఠుడు. రాజు, రాణి ఆ శిశువును తమ సొంత కొడుకుగా పెంచుకున్నారు. అయితే, శిశువు లభించిన సమయంలోనే, అడవి నుండి వచ్చిన ఒక మహర్షి, వీడు అసాధారణమైన దైవాంశ సంభూతుడు. పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఇతని నిజ స్వరూపం మీకు తెలుస్తుందని చెప్పి మాయమయ్యాడు. అయితే, మణికంఠుడు రాజకుమారుడిగా వచ్చిన కొన్ని రోజులకే మహారాణికి సొంత కొడుకు జన్మించాడు. మణికంఠుడు యువరాజు కావడం ఇష్టం లేని మహారాణి, తన మంత్రి దుర్బోధతో కుట్ర పన్నింది. తనకి విపరీతమైన కడుపు నొప్పి వచ్చిందని, వైద్యులు చెప్పినట్లుగా పులిపాలు తాగితేనే నొప్పి తగ్గుతుందని నటన మొదలుపెట్టింది. . అప్పుడు మణికంఠుడు తాను పులిపాలు తెచ్చి మహారాణి బాధను నివారిస్తానని తండ్రికి మాటిచ్చాడు. రాజు, రాణి, ప్రజలు ఎంత వద్దని వారించినా వినకుండా, మణికంఠుడు తన అవతార లక్ష్యం నెరవేర్చడానికిగాను విల్లు, అమ్ములతో అడవిలోకి బయలుదేరాడు. మణికంఠుడు అడవిలో ప్రవేశించిన తర్వాత ఆ ప్రాంతంలో భయంకరమైన రాక్షసుడైన మహిషిని సంహరించాడు. ఈ సంహారం దేవతలకు ఆనందం కలిగించింది.అనంతరం, ఇంద్రుడు తన రూపాన్ని మార్చుకుని, మణికంఠుడి ఆదేశం మేరకు వేలాదిమంది పులులతో కూడిన దళాన్ని ఏర్పాటు చేశాడు. ఈ దళంలోని ఒక పెద్ద పులిని వాహనంగా చేసుకుని, మిగిలిన పులుల వెనుక మహారాణికి అవసరమైన పాలు తీసుకెళ్లడానికి మణికంఠుడు పందళం రాజ్యానికి బయలుదేరాడు. మణికంఠుడు పులిపై స్వారీ చేస్తూ, పులుల దళంతో రాజభవనానికి చేరుకున్న దృశ్యం చూసిన మహారాణి, మంత్రి ప్రజలు భయభ్రాంతులయ్యారు. మహారాణి పశ్చాత్తాపంతో మణికంఠుడి కాళ్లపై పడి క్షమించమని వేడుకుంది. అప్పుడు మణికంఠుడు, "అమ్మా! నా అవతారం సమాప్తమైంది. నేను కేవలం పందళ రాజకుమారుడిని కాదు. శివకేశవుల అద్భుత సమ్మేళనంగా జన్మించిన ధర్మశాస్తను. మీకు మళ్లీ జన్మనిచ్చినందుకు, నన్ను పెంచినందుకు కృతజ్ఞతలు. ఇకపై నేను కొండపైకి వెళ్లిపోతాను, నన్ను దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు నియమ నిష్టలతో 41 రోజులు దీక్ష తీసుకుని వస్తారు. వారు నా పదునెట్టాంబడి (18 మెట్లు) ఎక్కి నన్ను దర్శించుకుంటారు" అని చెప్పి తన దైవ స్వరూపాన్ని చూపించాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story