During the Month of Karthika: కార్తీక మాసంలో ఏం చేయాలి ఏం చేయకూడదు?
ఏం చేయాలి ఏం చేయకూడదు?

During the Month of Karthika: కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో శివకేశవుల ఆరాధనకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెలలో పాటించాల్సిన నియమ నిబంధనలు, చేయాల్సిన, చేయకూడని పనులు చాలా ఉన్నాయి. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానం లేదా కనీసం ఇంట్లో చన్నీటి స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని శాస్త్రాలు చెబుతాయి. కార్తీక మాసం మొదటి నుండి ఆకాశ దీపాన్ని వెలిగించడం శుభకరం. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంట్లో, పూజా మందిరంలో, తులసి కోట వద్ద దీపాలను వెలిగించడం వల్ల ఇహ, పర సౌఖ్యాలు కలుగుతాయి. దేవాలయాలలో దీపాలు వెలిగించడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ఉత్తమం. కార్తీక మాసం శివునికి అత్యంత ప్రీతికరమైనది. శివాలయాలను సందర్శించి, రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కార్తీక సోమవారాలు శివుడికి అత్యంత విశిష్టమైనవి. ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు కూడా ప్రీతికరమైనది. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శ్రేష్టం. తులసి పూజకు ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతిరోజు 'కార్తీక పురాణం' రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం.
కార్తీక మాసంలో చేయకూడనివి:
కార్తీక మాసంలో మాంసాహారం, మద్యం సేవించడం పూర్తిగా నిషేధం. కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, గుమ్మడికాయ, నువ్వులు, పెసరపప్పు, శనగపప్పు, జీలకర్ర, కాకరకాయ, వంకాయ వంటివి తినకూడదని పండితులు చెబుతారు. శరీరానికి లేదా తలకు నూనె రాయకూడదు. నెల రోజుల పాటు నలుగు పెట్టుకుని స్నానమాచరించకూడదని సూచిస్తారు. ఉదయం ఆలస్యంగా నిద్ర లేవకుండా, సూర్యోదయానికి ముందే స్నానాదికాలు ముగించి పూజలు చేయాలి. ఇతరులపై కోపం, ఈర్ష్య, అసూయ వంటివి పెంచుకోకూడదు. ఎవరినీ దైవ దూషణ చేయకూడదు. కార్తీక మాసంలో నూనె, పసుపు, ఇనుము దానం చేయడం మంచిది కాదని కొన్ని గ్రంధాలు సూచిస్తున్నాయి. నూనె దానం చేస్తే ధన నష్టం, పసుపు దానం చేస్తే గురుదోషం, ఇనుము దానం చేస్తే శని దోషం కలుగుతాయని అంటారు. కార్తీక మాసంలో తులసి మొక్కలను తెంచకూడదు. తులసి పూజకు ఈ మాసంలో విశేష ప్రాధాన్యత ఉంటుంది.
కార్తీక మాసంలో నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ నియమాలు పాటించడం వల్ల ఆధ్యాత్మికంగా, శారీరకంగా మేలు కలుగుతుంది.
