Where Should You Keep a Dustbin at Home: ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెట్టాలి? వాస్తు ప్రకారం ఈ దిశల్లో అస్సలు పెట్టొద్దట!
ఈ దిశల్లో అస్సలు పెట్టొద్దట!

Where Should You Keep a Dustbin at Home: ఇంట్లో చెత్తబుట్టను ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి. చెత్తబుట్టను ఉంచే ప్రదేశం కూడా ఇంటి వాతావరణంపై ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని దిశల్లో చెత్తబుట్టను ఉంచడం మంచిదని, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అస్సలు పెట్టకూడదని సూచిస్తున్నారు.
వాస్తు ప్రకారం ఇంట్లో చెత్తబుట్ట పెట్టడానికి నైరుతి దిశను అత్యంత అనుకూలమైన ప్రదేశంగా భావిస్తారు. ఈ దిశలో చెత్తబుట్ట ఉంచితే ఇంట్లో ప్రతికూల శక్తి తగ్గుతుందని నమ్మకం. అంతేకాదు.. సాధారణంగా ఇంట్లో ఎక్కువగా సంచరించని ప్రాంతం కావడంతో చెత్త వాసన కూడా ఇల్లంతా వ్యాపించకుండా ఉండే అవకాశం ఉంటుంది.
నైరుతి దిశ అందుబాటులో లేకపోతే.. వాయువ్య మూలను కూడా చెత్తబుట్ట పెట్టేందుకు అనుకూలంగా భావిస్తారు. అలాగే దక్షిణం, పడమర దిశల్లో కూడా చెత్తబుట్టను ఉంచవచ్చని వాస్తు సూచనలు చెబుతున్నాయి.
అయితే ఇంట్లోని ఈశాన్య మూలలో మాత్రం చెత్తబుట్టను పెట్టకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈశాన్య దిశను పూజా స్థలం, సానుకూల శక్తికి సంబంధించిన ముఖ్యమైన ప్రాంతంగా భావిస్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని చెబుతారు.
అలాగే ఉత్తరం, తూర్పు దిశల్లో కూడా చెత్తబుట్టను ఉంచడం మంచిది కాదనే నమ్మకం ఉంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం తగ్గి, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి పెరుగుతాయని వాస్తు చెబుతోంది.
ఇక మరో ముఖ్యమైన విషయం.. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా దానికి సరిగ్గా ఎదురుగా చెత్తబుట్టను పెట్టకూడదని సూచిస్తున్నారు. ఇంట్లోకి ప్రవేశించే ప్రాంతం ఎప్పుడూ శుభ్రంగా, చక్కగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
అయితే ఇవన్నీ వాస్తు, సంప్రదాయ నమ్మకాల ఆధారంగా చెప్పే సూచనలు మాత్రమే. శాస్త్రీయంగా చెత్తబుట్టను ఏ దిశలో పెట్టాలనే దానికంటే.. దాన్ని శుభ్రంగా ఉంచడం, మూత ఉన్న బిన్ ఉపయోగించడం, చెత్తను ఎక్కువసేపు నిల్వ చేయకుండా ఎప్పటికప్పుడు బయటకు వేయడం చాలా ముఖ్యం.
ముఖ్యంగా వంటగది, బెడ్‌రూమ్ వంటి ప్రదేశాల్లో చెత్తను ఎక్కువసేపు ఉంచకుండా.. దుర్వాసన, క్రిములు వ్యాపించకుండా పరిశుభ్రత పాటించడం ఆరోగ్యానికి ఎంతో అవసరం.

