పాట రచయిత ఎవరు?

Devotional Hymn Harivarasanam: శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల హృదయాలలో నిత్యం మారుమ్రోగే అత్యంత పవిత్రమైన గీతం 'హరివరాసనం'. శబరిగిరీశుడి ఆలయాన్ని రాత్రిపూట మూసివేసే ముందు, స్వామివారికి పవళింపు సేవగా ఆలపించే ఈ పాటను విన్న ప్రతి భక్తుడు తన్మయత్వం చెందుతాడు. ఈ పాట కేవలం ఒక కీర్తన మాత్రమే కాదు, అయ్యప్పస్వామి సమస్త రూపాన్ని, మహిమను వర్ణించే అష్టకం.

'హరివరాసనం' స్తోత్రం కచ్చితమైన రచయిత విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, చరిత్ర, పరిశోధనల ప్రకారం అత్యంత ప్రాచుర్యం పొందిన పేరు కుంభకుడి కులత్తూర్ అయ్యర్. తమిళనాడుకు చెందిన కుంభకుడి కులత్తూర్ శ్రీనివాస అయ్యర్ ఈ అష్టకాన్ని సంస్కృత-మలయాళ మిశ్రమ భాషలో రచించినట్లు పండితుల అభిప్రాయం. ఆయన రాసిన శాస్తృ స్తుతి కదంబం అనే కీర్తనల సంకలనంలో ఇది ఒక భాగమని చెబుతారు. కొంతమంది భక్తులు, పరిశోధకులు ఈ స్తోత్రాన్ని 1920లలో కొనకత్తు జానకి అమ్మ అనే భక్తురాలు రచించిందని కూడా పేర్కొంటారు. ఈ వాదన ఆమె చేతితో రాసిన కొన్ని నోట్స్ ఆధారంగా ఉంది.

1955లో స్వామి విమోచనానంద అయ్యర్ శబరిమల సన్నిధానంలో ఈ స్తోత్రాన్ని ఆలపించడం ద్వారా దీనికి గొప్ప గుర్తింపు లభించింది. ఆ తర్వాత, 1950ల దశకంలో అప్పటి ప్రధాన పూజారి వీఆర్. గోపాల మీనన్ అనే భక్తుడి జ్ఞాపకార్థం, ఆలయ ద్వారాలు మూసివేసే ముందు హరివరాసనం ఆలపించే సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఈ స్తోత్రానికి మరింత ప్రాచుర్యం 1975లో వచ్చిన మలయాళ చిత్రం 'స్వామి అయ్యప్పన్' ద్వారా లభించింది. ఈ సినిమాలో గాన గంధర్వుడు కె.జె. ఏసుదాస్ ఆలపించిన హరివరాసనం పాట ప్రపంచవ్యాప్తంగా అయ్యప్ప భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

హరివరాసనం అనేది కేవలం నిద్రపుచ్చే పాట (లాలి పాట) మాత్రమే కాదు, అయ్యప్పస్వామి అనంతమైన మహిమలను వర్ణించే ఒక శక్తివంతమైన స్తోత్రం. శబరిమల ఆలయంలో ప్రతి రోజు రాత్రి అత్తాళ పూజ'తర్వాత, సన్నిధానం తలుపులు మూసివేసే ముందు ఈ పాటను ఆలపిస్తారు. ఇది స్వామివారిని పవళింపు (నిద్ర) కోసం సిద్ధం చేసే నిద్ర పాటగా ప్రసిద్ధి చెందింది. ఈ పాట ఆలపిస్తున్నప్పుడు ఒక్కొక్కరుగా సహాయక పూజారులు సన్నిధానం నుండి నిష్క్రమించి, చివరికి మేల్ శాంతి ఒక్కరే మిగిలి దీపాలు ఆర్పేసి తలుపులు మూసివేస్తారు.ఈ అష్టకం విష్ణుమూర్తి (హరి), శివుడు (హరుడు) అంశగా జన్మించిన అయ్యప్పస్వామి దివ్య లక్షణాలను, ఆయన లీలను, శరణాగతి తత్వాన్ని వర్ణిస్తుంది. అయ్యప్ప మాల ధరించిన భక్తులందరికీ ఈ పాట ఒక అంతిమ శరణాగతి మంత్రంగా భావించబడుతుంది. ఈ పాట వినడం ద్వారా తమ దీక్షా కాలం పరిపూర్ణమైందని, స్వామివారి అనుగ్రహం లభించిందని భక్తులు విశ్వసిస్తారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story