Seven Saturdays Vratam: ఏడు శనివారాల వ్రతం ఎందుకు చేస్తారు?
వ్రతం ఎందుకు చేస్తారు?

Seven Saturdays Vratam: హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్రతాలలో 'ఏడు శనివారాల వ్రతం' ఒకటి. ఏడు శనివారాల వ్రతాన్ని ప్రధానంగా శని గ్రహ దోషాల నివారణ కోసం చేస్తారు. అలాగే ఏడు కొండలవాడైన వేంకటేశ్వరస్వామి దయను పొందడం కోసం ఆచరిస్తారు. నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని చేస్తే.. ఇంట్లో సమస్యలు, అప్పుల బాధలు పోతాయని నమ్మకం. వ్రత ప్రభావంతో అనుకున్న పనులన్నీ సవ్యంగా నెరవేరుతాయని భావిస్తారు. వ్రతం పూర్తయ్యాక ముడుపును తీసుకుని తిరుమల వెంకన్నను దర్శించుకుంటే కష్టాలు కొండెక్కిపోతాయని ప్రగాఢ విశ్వాసం. ఈ వ్రతంలో భాగంగా వరుసగా ఏడు శనివారాలు నియమనిష్టలతో ఉపవాసం, నైవేద్య సమర్పణ, శని స్తోత్ర పఠనం వంటివి చేస్తారు. భార్యాభర్తల్లో ఎవరైనా ఈ వ్రతం చేయవచ్చు. మొదటి వారం శ్రీనివాసుడి చిత్రపటం/విగ్రహాన్ని అలంకరించి, వ్రతం ప్రారంభిస్తున్నామని సంకల్పం చెప్పాలి. కోరిన కోర్కెలు నెరవేరితే 7 కొండలు ఎక్కుతామని ముడుపు కట్టాలి. 7 వారాల పాటు 7 వత్తుల దీపం వెలిగించాలి. పూజ ఎలాగైనా చేయవచ్చు. శనివారాల్లో మద్యమాంసాల్ని ముట్టుకోకూడదు. చివరి వారం వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలి. వీలున్నప్పుడు తిరుపతి వెళ్లి ముడుపు సమర్పించాలి. శని దేవుడు న్యాయ ప్రదాత. ఆయన ప్రభావం వల్ల జీవితంలో ఏర్పడే ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, అదృష్టం లేకపోవడం వంటి సకల కష్టాలు, కర్మల ఫలం నుంచి ఉపశమనం పొందడానికి ఈ వ్రతం చేస్తారు.

