Hanuman: ఆంజనేయుడు బ్రహ్మచారిగా ఎందుకు మిగిలిపోయాడు?
బ్రహ్మచారిగా ఎందుకు మిగిలిపోయాడు?

Hanuman: పవిత్రమైన బ్రహ్మచారిగా ఆంజనేయుడిని చాలామంది నమ్ముతారు. అయితే, కొన్ని పురాణాలు మరియు గ్రంథాల ప్రకారం, హనుమంతుడు వివాహం చేసుకున్నాడు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. హనుమంతుడు సూర్య భగవానుడిని తన గురువుగా స్వీకరించి విద్య నేర్చుకుంటూ ఉంటాడు. అన్ని విద్యలను నేర్చుకున్న తరువాత, చివరి నాలుగు విద్యలు నేర్పడానికి సూర్య భగవానుడు ఒక షరతు పెడతాడు. ఆ విద్యలు కేవలం వివాహితులకు మాత్రమే నేర్పిస్తానని చెబుతాడు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్న హనుమంతుడు దీనికి అంగీకరించడు. అయితే లోక కల్యాణం కోసం, తనకు గురుదక్షిణగా సూర్యుడి కుమార్తె అయిన సువర్చలా దేవిని వివాహం చేసుకోవాలని సూర్య భగవానుడు కోరతాడు. సూర్యుని తేజస్సు నుంచి జన్మించిన సువర్చల, వివాహం తర్వాత తపస్సు చేసుకోవడానికి అడవికి వెళుతుందని, హనుమంతుడి బ్రహ్మచర్యానికి ఎటువంటి భంగం కలగదని సూర్యుడు హామీ ఇస్తాడు. గురువు మాటను గౌరవించి, హనుమంతుడు సువర్చలను వివాహం చేసుకుంటాడు. వివాహం జరిగిన వెంటనే సువర్చల తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోతుంది. దీంతో హనుమంతుడు తన బ్రహ్మచర్య దీక్షకు భంగం కలగకుండానే మిగిలిన విద్యలను నేర్చుకుంటాడు. ఈ కారణంగానే హనుమంతుడిని వివాహితుడైన బ్రహ్మచారి అని పిలుస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో హనుమంతుడికి, ఆయన భార్య సువర్చలకు ఒక దేవాలయం ఉంది. భారతదేశంలో చాలా ప్రదేశాలలో ఈ ఆలయం ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది.
